మంత్రి, ఎమ్మెల్యేకు మాస్కు అవసరం లేదా..?

by Web Desk |
మంత్రి, ఎమ్మెల్యేకు మాస్కు అవసరం లేదా..?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చట్టాలు అమాత్యులకు వర్తించవా..? నిబంధనలను వారు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోరా? సామాన్యునికి ఒక న్యాయం, ప్రజా ప్రతినిధులకు మరో న్యాయమా? ఇదేనా అధికారుల తీరు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొవిడ్, ఒమిక్రాన్ విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చింది. మాస్కు తప్పనిసరిగా ధరించి సామాజికదూరం పాటించాలని జీఓ సైతం జారీ చేసింది. ఉల్లంఘించిన వారు శిక్షార్హులని, మాస్కు లేకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయలు ఫెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా అందరికీ తెలిసేలా ముఖ్య కూడళ్లలో బోర్డులు సైతం ఏర్పాటు చేసింది. ఇంత వరకు బాగానే ఉంది.

వీటిని ఉల్లంఘించే తిరిగే సాధారణ ప్రజానీకానికి అధికారులు పెనాల్టీలు వేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే అమాత్యులు బాహాటంగా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా వారికి ఫైన్ వేయాల్సిన అధికారులు వారి వెంట జీ హుజూర్ అంటూ తిరగడం అంతటా చర్చనీయాంశమైంది. బేగంబజార్‌లో నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్ భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో శనివారం మంత్రి తలసాని, ఎమ్మెల్యే రాజాసింగ్, బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి తలసాని, ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ ఉన్నంత సేపు మాస్కు ధరించలేదు. అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ అదే తంతు. ఇదిలా ఉండగా మంత్రి

వస్తున్న సమాచారంతో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులంతా గుంపులుగా అక్కడికి వచ్చారు. మంత్రి దగ్గరికి వచ్చి ఆయన దృష్టిలో పడేందుకు ఆరాట పడ్డారు. ఇలా గుంపులుగా ఒక్క దగ్గర ఉండరాదనే ఆంక్షలు ఉన్నప్పటికీ మంత్రే స్వయంగా వాటిని తుంగలో తొక్కగా అధికారులు వారికి వంత పాడారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన మంత్రికి, ఎమ్మెల్యేకు ఏ అధికారి ఫెనాల్టీ విధిస్తారో చూడాలి అనే అభిప్రాయం అక్కడున్న వారిలో వ్యక్తమైంది.



Next Story