దద్దరిళ్లిన ఎల్బీనగర్.. వాసవీ కన్‌స్ట్రక్షన్స్‌ సైట్‌లో భారీ పేలుళ్లు

by Dishafeatures2 |
దద్దరిళ్లిన ఎల్బీనగర్.. వాసవీ కన్‌స్ట్రక్షన్స్‌ సైట్‌లో భారీ పేలుళ్లు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్/ చైతన్యపురి : నిబంధనలకు విరుద్ధంగా ఓ నిర్మాణ సంస్థ జరిపిన భారీ పేలుళ్లు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేశాయి. పేలుళ్ల దాటికి ఇండ్ల గోడలకు బీటలు వచ్చాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. దీంతో ఉలిక్కిపడిన ప్రజలు భూకంపం వచ్చిందేమోననే అనుమానంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. శబ్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయా అని ఆరాతీయడంతో ఓ కార్పొరేట్ నిర్మాణ సంస్థ చేసిన పేలుళ్లే కారణమని తెలుసుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్బీనగర్‌లో గతంలో సిరీస్ ఫ్యాక్టరీ ఉన్న స్థలంలో కొంత కాలంగా ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవీ కన్‌స్ట్రక్షన్స్‌ బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్ల నిర్మాణ పనులు చేపడుతోంది. పనులు మొదలైన నాటి నుంచి తవ్వకాలలో వచ్చే బండరాళ్లను తొలగించేందుకు పేలుళ్లు జరిపి తొలగిస్తున్నారు. ఇవి స్థానికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతుండడంతో పనులు మొదలైన నాటి నుంచి పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

అయినా వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తూ పరిసర ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కృష్ణానగర్ కాలనీలో బండరాళ్లను పగులగొట్టేందుకు భారీ పేలుడు పదార్ధాన్ని వినియోగించారు. ఆ పేలుడు ధాటికి కొన్ని బండరాళ్లు ఎగిరివచ్చి ఇండ్లపై పడ్డాయి, అక్కడక్కడ ఇండ్లు కంపించిపోయాయి, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుళ్ల శబ్ధంతో స్థానికులు భూకంపం వచ్చిందా అన్ని భయపడి వీధులలోకి పరుగులు పెట్టారు.

అర్ధరాత్రి పనులు..

కార్పొరేట్ నిర్మాణ సంస్థలు తమ ఇష్టానుసారంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు అంతటా వినబడుతున్నాయి. నిర్మాణంలో భాగంగా రాత్రి సమయాల్లో తరుచూ బాంబ్ బ్లాస్టింగ్ శబ్ధాలు వస్తూనే ఉన్నాయని, గతంలో బాగా దుమ్మూదూళి ఇండ్లలోకి వస్తే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చుట్టూ రేకులు ఏర్పాటు చేసి పనులు కొనసాగిస్తున్నారు. సెల్లార్ తవ్వకాలలో పెద్ద బండరాళ్లు అడ్డురావడంతో పేలుళ్లు జరుపుతున్నారు. గతంలో ఇందులో పని చేస్తున్న కార్మికులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయని, అయితే వారిని మూడవకంట పడకుండా ఆస్పత్రికి వైద్యం అందించినట్లు తెలిసింది. ఇలా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్మాణ పనులు జరుపుతున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాకుండా నిర్మాణ పనుల కారణంగా శబ్ద కాలుష్యం, దుమ్మూధూళి, రాత్రులు సైతం నిద్రలేకుండా అరచేతిలో ప్రాణాలను బిగపట్టుకొని ఉంటున్నామని వారు వాపోయారు. నిబంధనల మేరకు సెట్‌బ్యాక్ కూడా లేదని, నిర్మాణ పనులలో భాగంగా టిప్పర్ల ద్వారా మట్టిని బయటకు పంపిస్తున్న సమయంలో దుర్గంధం వెదజల్లుతోందని మండిపడ్డారు. గతంలో సిరీస్ కెమికల్ కంపెనీ ఇక్కడ ఉండడం వలన దాని నుంచి వెలువడిన రసాయన పదార్థాలు పైపుల ద్వారా భూమిలోకి ఇంకే విధంగా చేశారని, ఫలితంగా ప్రజల ప్రాణాలకు కీడు చేసే రసాయనాలు భూమిలోకి చేరిందని. ఇప్పుడు చేపడుతున్న నిర్మాణ పనులతో అందులో నుంచి దుర్గంధం వెదజల్లుతుందని దీంతో రోగాల భారిన పడుతున్నామని కొంత మంది స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాల వినియోగం?

గతంలో పలు పర్యాయాలు పేలుళ్లు జరిపినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. దీంతో తాజాగా పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలు వినియోగించడంతో తీవ్రత ఎక్కువై ఇండ్లకు పగుళ్లు వచ్చాయని కృష్ణానగర్, భగత్‌సింగ్ నగర్, శంకర్ నగర్, డాక్టర్స్ కాలనీ, ఇంద్రానగర్, తదితర కాలనీలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయని వారు వాపోయారు. నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుని నష్ట పరిహారం చెల్లించాలని, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించేలా చేస్తున్న నిర్మాణ పనులు వెంటనే నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

అందమైన బ్రోచర్లతో..

నగరంలో ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థగా చెలామని అవుతున్న వాసవీ గ్రూప్ సంస్థ ఎల్బీనగర్‌లోని మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న (పాత సిరీస్ రసాయన కంపెనీ) స్థలంలో కొంత కాలంగా గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ అపార్ట్‌మెంట్స్ నిర్మాణం చేపట్టింది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఖరీదైన ఫ్లెక్సీలు, ప్రచార ఆర్భాటాలు, హోర్డింగులు ఏర్పాటు చేసింది. లాంచింగ్ ఆఫర్ కింద బుకింగ్స్ తీసుకుంది. నిబంధనల ప్రకారం రాత్రిపూట పనులు చేపట్టకూడదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట వాసవీ కన్‌స్ట్రక్షన్‌లో పేలుళ్లు జరిపారు. దీంతో చుట్టుపక్కల కాలనీలలోని ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

అర్ధరాత్రి ఎల్బీనగర్‌లోని పాత సిరీస్ స్థలంలో చోటు చేసుకున్న పేలుళ్లపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. పనులు చేపడుతున్న వాసవీ గ్రూప్ సంస్థ ప్రతినిధులను, అక్కడ పనిచేస్తున్న కార్మికులను, సమీప ప్రాంతాల బస్తీల ప్రజలను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.



Next Story

Most Viewed