వికలాంగుల పెన్షన్‌ను ఆరు వేలకు పెంచాలి : Manda Krishna Madiga (మంద కృష్ణ మాదిగ)

by Disha Web Desk 13 |
వికలాంగుల పెన్షన్‌ను ఆరు వేలకు పెంచాలి : Manda Krishna Madiga (మంద కృష్ణ మాదిగ)
X

దిశ, సికింద్రాబాద్: రాష్ట్రంలో వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ రూ. మూడు వేల నుంచి రూ. ఆరు వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీహెచ్పీఎస్ పోరాట దినోత్సవ రాష్ట్ర మహాసభను ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ హాల్లో శనివారం నిర్వహించారు. వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం కాశిం అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగుల సహకార సంస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. వీహెచ్పీఎస్ చేసిన ఉద్యమంతో దేశంలో ఎక్కడా లేనటువంటి వికలాంగుల పెన్షన్‌ను సాధించుకోగలిగామని చెప్పారు. ప్రతి వికలాంగులకు బస్సు, రైళ్లలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి వికలాంగునికి అర్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశం కల్పించాలని చెప్పారు.

దళిత బంధు మాదిరిగా వికలాంగులకు వికలాంగుల బంధు అమలు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు శాతం వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు గోపాల్ రావు, జాతీయ కోఆర్డినేటర్ షణ్ముఖరావు, అందె రాంబాబు, నాగభూషణం, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్, సుజాత, సూర్యవంశీ, విజయరావు తదితరులు పాల్గొన్నారు.



Next Story