సిటీకి సీజనల్ వ్యాధుల భయం.. విజృంభిస్తున్న మలేరియా

by Dishafeatures2 |
సిటీకి సీజనల్ వ్యాధుల భయం.. విజృంభిస్తున్న మలేరియా
X

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మహానగరం పరిధిలో మధ్యతరగతి, నిరుపేదలు ఎక్కువగా నివసించే బస్తీలు సుస్తీ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా శానిటేషన్ స్తంభించింది. వానాకాలం నేపథ్యంలో శానిటేషన్ పనులు, దోమల నివారణపై ప్రత్యేకంగా దృష్టిసారించామని జీహెచ్ఎంసీ ప్రకటిస్తున్నా, ఆ చర్యలు కేవలం వీవీఐపీలు, వీఐపీలు నివసించే ప్రాంతాలకే పరిమితమయ్యాయన్న విమర్శలున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటిలో మురుగునీటి వాసన వస్తున్నట్లు స్థానికులు వాపోయారు. ఫలితంగా మురికివాడలు, బస్తీల్లో నివసించే ప్రజలు డయేరియా బారినపడాల్సి వస్తుందని వాపోతున్నారు. నగరంలోని సుమారు 1700 మురికివాడల్లో వందలాది మంది జలుబు, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మలేరియా, డయేరియా, డెంగీ తదితర వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారు.

అనారోగ్య లక్షణాలు కన్పించగానే వీరిలో చాలామంది లోకల్ క్లీనిక్‌లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నందున మలేరియా, డయేరియా, డెంగీ వంటి కేసులు బయటకురావటం లేదు. ఈ మురికివాడల్లోని పలు క్లీనిక్‌లు, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే నగరంపై సీజనల్ వ్యాధులు వార్ చేస్తుండగా, సిటీలోని 91 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో డెంగీ అనుమానిత కేసులు వస్తున్నట్లు సమాచారం. వివిధ సీజనల్ వ్యాధుల లక్షణాలతో బాధడుతూ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి చికిత్స కోసం ప్రతిరోజు 300 నుంచి 400 వందల మధ్య ఔట్ పేషెంట్ కేసులు వస్తుండగా, కొద్దిరోజుల నుంచి ఓపీ కేసులు అపుడపుడు రెండింతలవుతున్నట్లు సమాచారం. ఒక్కో బస్తీదవాఖానాలో వ్యాధినిర్థారణ కోసం వందల సంఖ్యలో బ్లడ్ శ్యాంపిల్స్ సేకరిస్తున్నట్లు సమాచారం.

ఫాగింగ్ వీవీఐపీ జోన్లకేనా?

ఫాగింగ్ విధానం కేవలం ప్రగతిభవన్, రాజ్‌భవన్, అసెంబ్లీ ఆవరణ, కొత్తసచివాలయం, జీహెచ్ఎంసీ ప్రధానక కార్యాలయం, బీఆర్కే భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిష్టర్ క్వార్టర్స్ తదితర ఉన్నతాధికారులు, వీఐపీలుండే ప్రాంతాల్లోనే చేస్తున్నారే తప్పా, పేదలు నివసించే బస్తీల్లో చేయటంలో జీహెచ్ఎంసీ విఫలమవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బ్లాక్ గ్లాసెస్ లేకుంటే..

సీజనల్ వ్యాధులతో పాటు ఈ సారి కండ్లకలక కూడా మహానగరంలో కలకలం సృష్టిస్తుంది. కళ్లు ఎర్రగా కనబడ్డాయంటే చాలు జనాలు దూరంగా ఉండి మాట్లాడుతున్నారు. కళ్లకు నల్లటి అద్దాలు ధరించి ఉన్నా, జనాన్ని ఇన్ఫెక్షన్ భయపెడుతుంది. ఈ వ్యాధి బారినపడి సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతుంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఇప్పటి వరకు ఈ వ్యాధిపై ఒక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించకపోవటం ప్రజారోగ్య పరిరక్షణకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇంటింటికి అవగాహన కల్పించే నెట్‌వర్క్, మ్యాన్‌పవర్ ఉన్నా, జిల్లా వైద్యారోగ్యశాఖ కనీసం ఉత్తర్వులు కూడా జారీచేయటం లేదంటే పేదల ప్రాణాలకు వారిచ్చే విలువను అంచనా వేయవచ్చు. కనీసం విద్యాలయాల్లోనూ వ్యాధినివారణ చర్యలు చేపట్టకపోవటం శోచనీయం.



Next Story

Most Viewed