రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు శ్రీకారం

by Dishanational1 |
రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు శ్రీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సగటులో తెలంగాణ మొదటి స్థానానికి చేరుకున్నదని, రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు శ్రీకారం చుట్టామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ హోటల్ మ్యారిగోల్డ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ వ్యవసాయంలో అగ్రగామీ రాష్ట్రంగా నిలబడిందన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహించాలని, బ్యాంకులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి వాటి స్థాపనపై దృష్టిసారించాలన్నారు. ప్రజలకు ఉపాధి కలిగే అవకాశాల మీద బ్యాంకులు అధ్యయనం చేయాలని సూచించారు. డైరీ రంగాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, బ్యాంకులు డైరీ రంగంపై అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇచ్చే విదేశీ విద్య బ్యాంకు రుణాల గరిష్ట పరిమితి రూ.7.5 లక్షల నుంచి పెంచాలన్నారు. వేరుశెనగ పంట ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నదన్నారు.

అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో వినియోగించే పీనట్ బట్టర్ కు డిమాండ్ ఉన్నదని కానీ, అక్కడ వేరుశెనగ పంట పండదని, ఆ పంట ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడానికి క్షేత్రస్థాయి అవకాశాలను పారిశ్రామికవేత్తలే కాకుండా బ్యాంకులు కూడా పరిశీలించాలని, 2022 - 23 సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి బ్యాంకులు ఇచ్చే రుణాలు పెట్టుకున్న లక్ష్యంలో 62 శాతమే చేరుకున్నారన్నారన్నారు. బ్యాంకులు రుణాల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, ఎస్ఎల్ బీసీ అధ్యక్షుడు అమిత్ జింగ్రాన్ , జీఎం నాబార్డ్ డాక్టర్ వై.హరగోపాల్, ఆర్ బీఐ డీజీఎం కేఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed