శ్రీ నారాయణ కాలేజీని మూసివేస్తాం: ఇంటర్ బోర్డు

by Mahesh |
శ్రీ నారాయణ కాలేజీని మూసివేస్తాం: ఇంటర్ బోర్డు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: అనుమతులు లేకుండా మూడేళ్లుగా నిర్వహిస్తున్న శ్రీ నారాయణ ఇంటర్ కాలేజీని వెంటనే మూసివేస్తామని హైదరాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వడ్డెన్న స్పష్టం చేశారు. లంగర్ హౌస్‌లోని శ్రీ నారాయణ కాలేజీ యాజమాన్యం నిబంధనలు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమ అధికారులు తనిఖీలకు వెళ్లగా కాలేజీ యాజమాన్యం వారితో తప్పుడు సమాచారం ఇప్పించిందని ఈ సందర్భంగా వడ్డెన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారులను బురిడీ కొట్టించేందుకు యత్నించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

చర్యలు ఎప్పుడు...?

శ్రీ నారాయణ కాలేజీ యాజమాన్యంతో ఇంటర్ బోర్డు అధికారులు కుమ్మక్కై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంగర్ హౌస్‌లో మూడేళ్లుగా శ్రీ నారాయణ కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా కాలేజీ నిర్వహిస్తున్నా కనీసం ఇంటర్ బోర్డు అధికారులకు విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు కళాశాల యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ నారాయణ కళాశాల నిర్వహణపై మొదటి నుంచి అధికారులకు సమాచారం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే మెతక వైఖరి అవలంబిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చర్యలు తీసుకోవడానికి నేడు, రేపు, అంటూ నానుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. బోర్డు అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇంటర్ బోర్డుకు బాధ్యత లేదా...?

నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కాలేజీ పై చర్యలు తీసుకోవడంలో మెతక వైఖరి అవలంబిస్తున్న ఇంటర్ బోర్డు అధికారులకు బాధ్యత లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోకపోవడంపై మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కళాశాల యాజమాన్యం తో కుమ్మక్కు అయిన ఇంటర్ బోర్డు అధికారులపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. లంగర్ హౌస్‌లోని శ్రీ నారాయణ కళాశాలను వెంటనే మూసివేయించి విద్యార్థుల జీవితాలను కాపాడాలని కోరుతున్నారు.

Next Story