మా తాత స్థాపించిన విశ్వవిద్యాలయంలో లక్షల మంది చదువుకోవడం గర్వంగా ఉంది

by Disha Web Desk 15 |
మా తాత స్థాపించిన విశ్వవిద్యాలయంలో లక్షల మంది చదువుకోవడం గర్వంగా ఉంది
X

దిశ, సికింద్రాబాద్ : మా తాత స్థాపించిన విశ్వవిద్యాలయంలో లక్షల మంది చదువుకోవడం గర్వంగా ఉంది అని ఏడవ నిజాం మనవడు నవాబ్ మీర్ నజఫ్ అలీఖాన్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే వేడుకల్లో భాగంగా బుధవారం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 82వ ర్యాంకు సాధించిన కౌశిక్, 545 ర్యాంక్​ సాధించిన నరేంద్రలతో పాటు డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఏడవ నిజాం మనవడు నవాబ్ మీర్ నజఫ్ అలీఖాన్, మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ మరియ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీఖాన్ మాట్లాడుతూ తన తాత స్థాపించిన విశ్వవిద్యాలయంలో లక్షల మంది చదువుకొని జీవితంలో స్థిరపడటం గర్వంగా ఉందన్నారు. అనంతరం

మరియ కుమార్ మాట్లాడుతూ తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థినేనని, 1983-85 మధ్య ఎంఏ ఫిలాసఫీ చదివానని గుర్తు చేశారు. తన జీవితంలో అభివృద్ధి అయ్యేందుకు ఓయూ నుంచే బీజం పడిందని పేర్కొన్నారు. గ్రంథాలయం, ల్యాండ్స్కప్ గార్డెన్ తదితర ప్రాంతాలలో స్నేహితులతో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయని చెప్పారు. వందేళ్ల క్రితమే నిజాం ముందుచూపుతో ఓయూను స్థాపించారని కొనియాడారు. దీంతో భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో ఓయూ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. దీనికి నిజాం ఆలోచనే కారణమని చెప్పారు. ఫౌండేషన్ డే సందర్భంగా తనని పిలిచి, పాతస్కృతులను తలుచుకునేందుకు కారణమైన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల భవన అర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్టీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ బీనవేణి షెఫర్డ్, ప్రొఫెసర్ కాశిం, డాక్టర్ కొండా నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed