రెండు ఫ్లోర్లు అక్రమ నిర్మాణాలే.. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో బయటపడ్డ కీలక విషయం..!

by Disha Web Desk 19 |
రెండు ఫ్లోర్లు అక్రమ నిర్మాణాలే.. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో బయటపడ్డ కీలక విషయం..!
X

దిశ, సిటీ బ్యూరో: నాంపల్లికి సమీపంలోని బజర్ ఘాట్‌లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించిన భవనానికి జీహెచ్ఎంసీ అధికారులు జీ ప్లస్ 2 అనుమతులు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. కానీ భవన యజమాని అదనంగా మరో రెండు అంతస్తులు, పైన పెంట్ హౌస్‌ను అక్రమంగా నిర్మించినట్లు సమాచారం. సెల్లార్లో భారీగా డ్రమ్ములలో రసాయనాలు నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ సెల్లార్‌ను కేవలం పార్కింగ్కు మాత్రమే వినియోగించాల్సి ఉండగా భవన యజమాని అక్రమంగా డ్రమ్ములలో రసాయనాలను నిల్వ చేయటం వల్లే ప్రమాదం జరిగిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జీ ప్లస్ టు అనుమతి తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

సెల్లార్ల వినియోగంపై కొరవడిన నిఘా

హైదరాబాద్ మహానగరంలో సెల్లార్ల వినియోగాన్ని నియంత్రించాల్సిన జీహెచ్ఎంసీ నిఘా కొరవడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేటికీ చాలా భవనాల్లో సెల్లార్లను కమర్షియల్‌గా వినియోగించడం, దానిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఒక వరంగా మారింది. చాలా సెల్లార్లలో ప్రారంభించిన హోటల్లు ఇతర వాణిజ్య సంస్థలను ప్రజాప్రతినిధులే ప్రారంభించడం గమనార్హం.

అది ఉత్తుత్తి కమిటీనా..?

సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ సేఫ్టీ మెజర్స్‌కు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని అప్పట్లో ప్రకటించిన ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు.. ఏ ఒక్క భవనాన్ని తనిఖీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు మాత్రమే దాదాపు నుంచి 200 భవనాలకు నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. కనీసం నాంపల్లి బజార్ ఘాట్‌లో జరిగిన ప్రమాద ఘటనతోనైనా అధికారులు స్పందిస్తారా..? కమిటీ నియమిస్తారా..? ఫైర్ సేఫ్టీపై పకడ్బందీ చర్యలు చేపడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ప్రమాదం జరిగితేనే సేఫ్టీ ప్రస్తావన

గడిచిన రెండేళ్లలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 6 నుంచి ఏడు భారీ అగ్ని ప్రమాదాలు సంభవించి సుమారు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన విధితమే. సికింద్రాబాద్ బోయగూడా ప్రాంతంలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించి బీహార్‌కు చెందిన 13 మంది మృతి చెందినప్పుడు, అదే సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సమీపంలోనే వైఎంసీఏ వద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి 8 మంది చనిపోయినప్పుడు, తాజాగా దక్కన్ మాల్‌లో కూడా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సందర్శించిన అధికారులు, అమాత్యులు పాలకులు ఇలాంటి ఘటనలు మునుముందు జరగకుండా చర్యలు చేపడతామని, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కేవలం ప్రకటనలు చేశారే తప్ప కార్యరూపం దాల్చలేదని విమర్శలు వెలుగుతున్నాయి.

తాజాగా నాంపల్లి లోని బజార్ ఘట్ ప్రాంతంలో ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి పదిమంది మృతి చెందడంతో ఘటన స్థలానికి వచ్చిన మున్సిపల్ మంత్రి ఘటనకు సంబంధించి విచారణ చేపడతామని, ఫైర్ సేఫ్టీ మెజర్స్ చేపడతామని పాత మాటే చెప్పుకు రావడం ప్రజలను విస్మయాన్ని గురిచేస్తుంది.


Next Story

Most Viewed