ఫైర్ సేఫ్టీ లేని వ్యాపార సంస్థలకు ఈవీడీఎం నోటీసులు

by Disha Web Desk 7 |
ఫైర్ సేఫ్టీ లేని వ్యాపార సంస్థలకు ఈవీడీఎం నోటీసులు
X

దిశ, సిటీబ్యూరో : మహానగరంలోని బహుళ అంతస్తుల్లోని కమర్షియల్ భవనాల్లో ఫైర్ సేప్టీ ప్రమాణాలను సమకూర్చేందుకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇటీవల నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బహుళ అంతస్తుల్లో కొనసాగుతున్న వ్యాపార సంస్థలు ఫైర్ సేఫ్టీ మెజర్స్ సమకూర్చుకునే విషయంలో, ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునే విషయంలో నిన్నమొన్నటి వరకు అవగాహన సదస్సులను నిర్వహించిన ఈవీడీఎం ఇప్పుడు నేరుగా క్షేత్రస్థాయికెళ్లి తనిఖీలు నిర్వహించి, ఫైర్ సేఫ్టీ ప్రమాణాల్లేని కమర్షియల్ భవనాలను గుర్తించి, నోటీసులు జారీ చేసింది.

ఇదివరకే 17 వ్యాపార సంస్థలకు నోటీసులు జారీ చేయగా, వాటిలో 13 సంస్థలు ఫైర్ సేఫ్టీ మెజర్స్‌ను సమకూర్చుకోగా, మరో నాలుగింటికి రెండోసారి నోటీసులు జారీ చేసిన ఈవీడీఎం తాజాగా మరో 23 వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, నోటీసులు జారీ చేసింది. ఈ 23 వ్యాపార సంస్థల్లో భారీగా సామానులను నిల్వ చేయడం, చాలా సులువుగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్లు నిర్ధారించి వ్యాపార సంస్థలను ఖాళీ చేయాలని, లేదంటే మరో చోటుకు మార్చుకోవాలని నోటీసుల్లో సూచించింది.

నోటీసులు జారీ చేసిన సంస్థలు

ఫైర్ సేఫ్టీకి సంబంధించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం తాజాగా శనివారం ఇంటిమేషన్ నోటీసులు జారీ చేసిన సంస్థల్లో కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, బార్, అమీర్‌పేట శ్రీనివాసనగర్ కాలనీలోని ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్, బంజారాహిల్స్‌లోని అశ్లే ఫర్నిచర్స్, సరూర్ నగర్ నరసింహాపురి కాలనీలోని వజ్రాల కాంప్లెక్స్, ఐఎస్ సదన్ వినయ్ నగర్ కాలనీలోని స్మార్ట్ బజార్, బేగంపేట ప్రకాశ్ నగర్‌లోని షాపర్స్ స్టాప్, ఎస్డీ రోడ్డు కళాసీగూడలోని మినర్వా కాంప్లెక్స్, లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సక్లెయిన్ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని ఉప్పల్‌లోని బాలాజీ ట్రేడింగ్ కంపెనీ, చాంద్రాయణగుట్టలోని కుమ్మర్ బస్తీలోని రిలయెన్స్ స్మార్ట్, కవాడిగూడ పద్మారావునగర్‌లోని ఎన్టీపీసీ బిల్డింగ్, బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఇన్ హౌజ్ ఫర్నిచర్, బంజారాహిల్స్‌లోని సహారా బేకర్స్, ప్రోవిజన్ స్టోర్స్, రోడ్ నెం.12 బంజారాహిల్స్‌లోని పెట్ ఎసెన్షియల్స్, బంజారాహిల్స్‌లోని హయ్ గోల్డ్ ఔట్ డోర్ ఫర్నిచర్, అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న రెట్రో మోటార్ సైకిల్స్, బంజారాహిల్స్‌లోని డార్క్‌వుడ్ లావిష్ యువర్ లివింగ్ ఫర్నిచర్, కెపీహెచ్‌బీ కాలనీలోని పీకేఆర్ కాంప్లెక్స్, అత్తాపూర్ గుడిమల్కాపూర్‌లోని ఆరుషీ సుజుకీ, ఈసీఐఎల్ క్రాస్ రోడ్డులోని తులసీ హాస్పిటల్, దిల్‌సుఖ్ నగర్, గడ్డిఅన్నారంలోని రిలయెన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్, ఎస్‌డీ రోడ్డు సికిందరాబాద్‌లోని భువన టవర్స్, సికింద్రాబాద్ కళాసీగూడలోని చెనయ్ ట్రేడ్ సెంటర్‌లకు ఇంటిమేషన్ నోటీసులు జారీ చేసినట్లు ఈవీడీఎం వెల్లడించింది.

Next Story

Most Viewed