దేశానికి ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించే ఎన్నికలు ఆలోచించి ఓటు వేయండి : కిషన్ రెడ్డి

by Disha Web Desk 11 |
దేశానికి ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించే ఎన్నికలు ఆలోచించి ఓటు వేయండి : కిషన్ రెడ్డి
X

దిశ, ముషీరాబాద్: మే13న జరగబోయే ఎన్నికలు దేశానికి ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించే ఎన్నికలని, ప్రజలంతా ఆలోచించి ఓటు వేసి మోదీని మరోసారి ప్రధానిని చేయాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో గురువారం రాత్రి కిషన్ రెడ్డి జీప్ యాత్ర నిర్వహించారు. కవాడిగూడ, భోలక్ పూర్, ముషీరాబాద్ డివిజన్లోని పలు బస్తీలలో ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డికి ప్రజలు దారిపొడవునా అభివాదం తెలుపగా బస్తీల్లో మహిళలు అడుగడుగునా మంగళ హారతులతో స్వాగతం పలికారు.

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజులు గడిచినప్పటికీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణలో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడారని అన్నారు.

ఆ రోజు నుంచి ఈరోజు వరకు పేద ప్రజలకు ఉచిత విజయం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రానున్న మరో ఐదు సంవత్సరాల పాటు ఈ ఉచిత బియ్యాన్ని అందిస్తామని మోదీ మాట ఇచ్చారని చెప్పారు. మీ 13న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోడీని, నన్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పోటీలో ఉన్న ఇతర పార్టీ నాయకులు ప్రజలు కష్టాల్లో ఉన్న రోజు ఏనాడు ముందుకు రాలేదని అన్నారు. అన్ని సందర్భాల్లోనూ ప్రజల వెంట ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకొని వారికి అండగా నిలిచానని చెప్పారు. దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే మోడీ నాయకత్వాన్ని మరోమారు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed