సూట్ కేసుల మనిషిని కాదు.. ప్రజల మనిషిని: కాంగ్రెస్ నేత బండి రమేష్

by Satheesh |
సూట్ కేసుల మనిషిని కాదు.. ప్రజల మనిషిని: కాంగ్రెస్ నేత బండి రమేష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక్కో మెట్టు ఎక్కుతూ రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన బండి రమేష్.. అనంతరం తాను ఎదిగిన చోటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి తృటిలో ఓడిపోయిన ఆయన.. అనంతరం టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులను అధిరోహించారు.

బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన రాకతో ఒక్కసారిగా కూకట్‌పల్లి రాజకీయాల్లో పెనుమార్పు కనబడుతుంది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజా ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలిచి తీరుతానని అంటున్న బండి రమేష్‌తో దిశ స్పెషల్ ఇంటర్వ్యూ..

దిశ: కూకట్ పల్లి నియోజకవర్గంలో మీరు కొత్త..? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారావును ఎలా ఎదుర్కొంటారు. మీ ప్రణాళిక ఏంటి.?

బండి రమేష్: నేను రాజకీయాలకు కొత్త కాదు, కూకట్‌పల్లి నియోజకవర్గానికి కొత్త కాదు. చాలా కాలంగా కూకట్ పల్లి నియోజకవర్గంతో నాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. గతంలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కేపీహెచ్‌బీ ఇంఛార్జీగా కూడా పనిచేశాను. ఇది వరకు రోడ్డుకు ఎడమవైపు ఉండే నియోజకవర్గం చూసే వాడిని, ఇప్పుడు కుడివైపు అంతే మార్పు. కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది.

వారికి సేవ చేసేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తాను. కూకట్‌పల్లి అభివృద్ధి కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటో స్థానికులకు తెలుసు, అక్కడి బస్తీవాసులకు తెలుసు. కానీ జరగాల్సిన అభివృద్ధి, చేయాల్సిన పనులపై నాకు స్పష్టత ఉంది. అందుకు అవసరమైన ప్రణాళిక ఉంది. అందుకు అనుగుణంగా, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా. కూకట్ పల్లి నుండి గెలిచి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా.

దిశ: కూకట్ పల్లిలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఏ మేర మీకు సహకరిస్తారని అనుకుంటున్నారు..?

బండి రమేష్: కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. బలమైన కేడర్ ఉన్నారు. వారిని ముందుండి నడిపే నాయకులు ఉన్నారు. మేమంతా కలిసి కట్టుగా పనిచేస్తాం. మాధవరం కృష్ణారావును ఓడిస్తాం. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కృష్ణారావును ఓడించేందుకు గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఏ పార్టీకైనా ఓ వ్యూహం ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా, ప్రజా సమస్యలే పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళతాం. సమూహంగా కలిసి పనిచేసే సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. అన్నీ చర్చించి వాటన్నింటిని ఏకాభిప్రాయంగా మలుచుకుని ముందుకు వెళతాం.

దిశ: కూకట్ పల్లి నియోజకవర్గంపై మీకు సరైన అవగాహన లేదు అనే ఆరోపణలపై మీరెలా స్పందిస్తారు..?

బండి రమేష్: కూకట్‌పల్లిపై నాకు అవగాహన లేదు అనే ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. హైదరాబాద్‌పై ముఖ్యంగా కూకట్‌పల్లిపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. కేపీహెచ్‌బీ, అల్లాపూర్, మూసాపేట్, బోయిన్ పల్లి, బేగంపేట్, కూకట్ పల్లి, బాలానగర్ ఇలా ప్రతీ డివిజన్, ప్రతీ కాలనీలో అక్కడ నెలకొన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇలా అనేక విషయాలపై నాకు పూర్తి అవగాహన ఉంది.

ఇక్కడి ప్రజలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా నన్ను ఆదరించే ప్రజాలున్నారు. అక్కున చేర్చుకునే అభిమానులు ఉన్నారు. నేను ప్రజల మనిషిని, సూట్ కేసుల మనిషిని కాదు. ఎక్కడి నుండో ఇక్కడికి రాలేదు. నేను హైదరాబాద్ లోకల్. ఇక్కడే వ్యాపారం చేశా, ఇక్కడే రాజకీయాలు చేస్తున్న.. ఇక్కడి ప్రజలతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది.

Next Story

Most Viewed