నాడు అడుగు పెట్టాలంటే భయం భయం..

by Disha Web Desk 20 |
నాడు అడుగు పెట్టాలంటే భయం భయం..
X

దిశ, బేగంపేట : కనీవినీ ఎరుగని రీతిలో దిద్దుకుంటున్న ధనియాలగుట్ట శ్మశానవాటిక ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారైంది. మంగళవారం మంత్రి కేటీఆర్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించనున్నారు. బేగంపేట నివాసుల దశాబ్దాల కల నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయసహకారాలతోనే అందుబాటులోకి రానుంది. ఎంతో మంది పాలకులు చేయలేని పనులను కేవలం తొమ్మిదేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో అభివృద్ధి చెందింది.

ఆరడుగుల జాగా కోసం..

ఆరడుగుల జాగా కోసం బేగంపేట నివాసితులు తొక్కని గడపా లేదూ.. విజ్ఞప్తులు అందుకున్న ప్రజాప్రతినిదీ లేరూ. ఐదు దశాబ్దాలుగా దహన సంస్కారాలకు ఇక్కడి వారు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణారావు ఇక్కడి వారి న్యాయమైన పోరాటం పై స్పందించి తాను సైతం కదం తొక్కారు. అప్పటివరకు శ్మశానవాటికకు నిర్దిష్టమైన స్థలమంటూ లేదు. ప్రభుత్వాలను సైతం శాసించే ఓ బడా స్కూల్ యాజమాన్యం గుప్పిట్లో ఉన్న ఆ స్థలంలో దహన సంస్కారాలు చేయాలంటే అప్పట్లో ఈ ప్రాంత ప్రజలు భయంతో జంకే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితులను సైతం ఢీకొట్టి కేసులను సైతం లెక్కచేయకుండా మూడున్నర ఎకరాల స్థలాన్ని శ్మశానవాటికకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సాధించారు. రూ.7.50 కోట్లతో వైకుంఠధామం నిర్మించడంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారు.

సౌకర్యాలతో..

విశాలమైన రోడ్లు, నాలుగు దహన వాటికలు, పూజ, పిండ ప్రదానం హాల్, కట్టెలు నిల్వ, అస్థికలు భద్రపరిచే, స్నానాల గదులు వంటి వసతులతో పాటు మంచినీటి సంప్, ఎలక్ట్రికల్, టాయి లెట్స్ వంటి సర్వత్రా సౌకర్యాలు కల్పించారు. ఇక్కడి నిర్మాణాలు ఆధునిక శైలిలో నిర్మితమై కనువిందు చేస్తున్నాయి. మధ్యలో అందమైన గార్డెన్ తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. ఇక ధ్యానముద్రలో ఉన్న పరమశివుడు విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్మశానవాటికలోని రోడ్ల వెంబడి, చుట్టూ గ్రీనరీని ఏర్పాటు చేశారు. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్, తాతాచారి కాలనీ, భగత్ సింగ్, వడ్డెరబస్తీ వంటి దాదాపు 20 బస్తీలకు ఈ శ్మశానవాటిక మంగళవారం నుండి అందుబాటులోకి రానుంది.

ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ముదిరాజ్..

సోమవారం ధనియాల గుట్ట స్మశాన వాటిక పనులను స్థానిక బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ముదిరాజ్ తో పాటు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్, ముకుంద రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సురేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరేష్, నాయకులు యాదగిరి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్, అఖిల్, పద్మా రెడ్డి ,ఆరిఫ్, తదితరులు కార్పొరేటర్ వెంట ఉన్నారు .

Next Story

Most Viewed