వసూళ్లకు ప్రైవేట్ సైన్యం.. పెంచి పోషిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

by Dishanational2 |
వసూళ్లకు ప్రైవేట్ సైన్యం.. పెంచి పోషిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
X

దిశ, సిటీ బ్యూరో: మహానగరవాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో మొత్తానికి పాలన పడకేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి లిఖితపూర్వకమైన ఆదేశాల్లేకుండానే మెడికల్ ఆఫీసర్లుగా కొనసాగవచ్చు. డిప్యూటేషన్ ముగిసినా ఇక్కడే కొనసాగుతూ జీతం క్లెయిన్ చేసుకుంటున్న అక్రమాలు బయటపడినా, కనీసం చర్యలు తీసుకునే నాథుడే కరవయ్యాడు. ఇలాంటి పరిస్థితులను ఆసరాగా చేసుకున్న కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు (ఏసీపీకి దిగువన ఉన్న సిబ్బంది) ఏకంగా ప్రైవేటు వ్యక్తలను వసూళ్లకు రంగంలో దింపటం చర్చనీయాంశంగా మారింది. పాతకాలపు శిథిలావస్థకు చేరిన భవనాలను, ఆక్రమణలను కూల్చాల్సి వస్తే కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈవీడీఎం సిబ్బందిచే కూల్చేసే వారు. కానీ ఇపుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి ప్రక్రియ లేకుండా తమ ప్రైవేటు సైన్యానికిచ్చి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. నిర్మితమవుతున్న భవనాలను సందర్శించిన నిర్మాణంలో డీవీయేషన్లు ఉన్నాయంటూ బెదిరిస్తూ బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారం సికిందరాబాద్ జోన్ లో జరుగుతుంది. ఈ వ్యవహారం తెలిసినా జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగంలోని చైన్ మెన్లను కనీసం పిలిచి ప్రశ్నించలేకపోతున్నారు. ఇందుకు వీరికి చైన్ మెన్లు నెలసరి మామూళ్లు చెల్లిస్తున్నందున తమ వ్యవహారం కూడా బయటపడుతుందన్న భయంతో కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయటం లేదు. ఫలితంగా కార్పొరేషన్ తో ఎలాంటి సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులు సైతం అడ్డదారిలో జీహెచ్ఎంసీ తరపున విధులు నిర్వహి స్తూ వసూళ్లకు పాల్పడుతూ, జీహెచ్ఎంసీని అప్రతిష్ట పాల్చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది.

స్కెచ్ అమలు ఇలా..

ప్రతి రోజు ఉదయం విధుల్లో చేరగానే పలువురు చైన్ మెన్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఎక్కడ పాతకాలపు భవనాలున్నాయి? ఎక్కడ కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నాయని అన్వేషిస్తుంటారు. ఎక్కడైనా నిర్మాణం జరిగితే ఆ నిర్మాణంలోని లొసుగులను తమ వద్దనున్న ప్రైవేటు సైన్యానికి బ్రీఫ్ ఇచ్చి, తాము జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, ఈవీడీఎం కు చెందిన అధికారులమం టూ బెదిరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిర్మాణంలో నిజంగానే డీవియేషన్స్ ఉన్న భవన యజమానులు భయపడి, ఎంతో అంత చెల్లించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. దీనికి తోడు సీసీ, బీటీ రోడ్లు కలిపి సుమారు 9 వేల కిలోమీటర్ల రోడ్డున్న మహానగరంలో ఇండియన్ రోడ్ కాంగ్రేస్ నిబంధనల ప్రకారం 30 శాతం అంటే 2700 కిలోమీటర్ల ఫుట్ పాత్ లు ఉండాలి. కానీ సీటీలో ఫుట్ పాత్ పెంపునకు అధికారులు చేస్తున్న కృషి కారణంగా ఇప్పటి వరకు దాదాపు 600 కిలోమీటర్ల వరకు పెరిగింది. ఈ రకంగా పెంచుతున్న ఫుట్ పాత్ పై సికిందరాబాద్ లోని పలు సర్కిళ్ల చైన్ మెన్లు ప్రైవేటు వ్యక్తుల మధ్య వర్తిత్వంతో అక్రమంగా ఫుట్ పాత్ లపై డబ్బాలు, స్టాళ్లను ఏర్పాటు చేయిస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed