జలమండలిలో అవినీతి జలగలు.. వాటర్ పైప్ లైన్ లేకుండానే సీవరేజ్ కనెక్షన్లు

by Disha Web Desk 23 |
జలమండలిలో అవినీతి జలగలు.. వాటర్ పైప్ లైన్ లేకుండానే సీవరేజ్ కనెక్షన్లు
X

దిశ,శేరిలింగంపల్లి : ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నీటి సరఫరాకు అప్పుడే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటి సరఫరాకు గిరాకీ పెరిగింది. ఇదే అనువుగా ప్రైవేట్ నీటి సరఫరాదారులు ఒక్కో ట్యాంకర్ కు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అయినా చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు తప్పడం లేదు. అటు హెచ్ ఎండబ్ల్యూఎస్ కూడా సరైన మోతాదులో నీటిని సరఫరా చేయలేక పోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా నీరు సరఫరా అవడం, ఇంకొన్ని చోట్ల అరకొరగా నీటి సరఫరా జరుగుతుందని పలు కాలనీల ప్రజలు చెబుతున్నారు. నీటి సరఫరాలో వ్యత్యాసానికి అనేక కారణాలు ఉన్నాయనే చెప్పాలి. అందులో వాటర్ వర్స్క్ సిబ్బంది అలసత్వం, చేతివాటం వల్ల ఇబ్బందులు తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హఫీజ్ పేట్ సెక్షన్ పరిధిలో అధికారుల మీద అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్కో సెక్షన్ లో ఒక్కో రకం

హఫీజ్ పేట్ వాటర్ వర్స్క్ సెక్షన్ లో చందానగర్, మియాపూర్, దీప్తిశ్రీనగర్ హఫీజ్ పేట్, కొండాపూర్, మాదాపూర్, డోయెన్స్ కాలనీ, గచ్చిబౌలి, నలగండ్ల, రామచంద్రపురం, పఠాన్ చెరుతో కలిపి మొత్తం 11 సెక్షన్ లు ఉన్నాయి. ఇందులో సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో సబ్ డివిజన్ కు డీజీఎంలు, ఒక్కో సెక్షన్ కు మేనేజర్లు, వీరిపై జనరల్ మేనేజర్ ఉంటారు. అలాగే కిందిస్తాయిలో పర్మనెంట్ సిబ్బంది, తాత్కాలిక సిబ్బంది ఇలా కిందనుండి పై స్థాయి వరకు అనేక మంది తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అయినా ఒక్కో ప్రాంతంలో పుష్కలమైన నీరు వస్తుండగా కొన్నిచోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. కిందిస్థాయి సిబ్బంది చేతివాటం వల్ల నీటి సరఫరాతో పాటు కనెక్షన్ ల విషయంలో గోల్ మాల్ చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. వాటర్ వర్క్స్ నిబంధనల ప్రకారం వాటర్ కనెక్షన్ లేకుండా సీవరేజ్ కనెక్షన్ లు ఇచ్చేందుకు ఆస్కారం లేదు. కానీ హఫీజ్ పేట్ జీఎం పరిధిలోని పలు సెక్షన్లలో అలాంటి నిబంధనలు గాలికి వదిలేసి సిబ్బంది ఇష్టారాజ్యంగా నీటి కనెక్షన్ లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో సెక్షన్ లో ఇల్లీగల్ నిర్మాణాల వద్ద గట్టిగా డబ్బులు వసూలు చేసి నీటి కనెక్షన్ లను ఇస్తుండగా, ఇంకొన్ని చోట్ల పాత కనెక్షన్ ఉందని చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండానే కొత్త కనెక్షన్స్ ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతి సెక్షన్ లోనూ సిబ్బంది చేతివాటం తో నీటి సరఫరాలో ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తుంది.

నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్ లు..

నల్లా నీటి కనెక్షన్ కావాలంటే వినియోగదారులు వాటర్ వర్క్స్ అధికారులు కోరిన విధంగా తమ ఇంటి పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంత స్థలంలో నిర్మాణం చేపడుతున్నారు. వాటికి ఎంత డయాతో కనెక్షన్ ఇవ్వచ్చు, ప్రధాన పైపులైన్ నుండి ఎంత దూరం నిర్మాణ స్థలం ఉంది, అది డొమెస్టిక్ కిందకు వస్తుందా, మల్టీపర్పస్ కనెక్షన్ కిందకు వస్తుందా అనేది చూసి అందుకు తగ్గట్టుగా ఫీజు కట్టించుకుని వాటర్ వర్స్క్ సిబ్బంది కనెక్షన్ ఇస్తుంటారు. ఎవరికైనా ఇంటి ముందే కనెక్షన్స్ ఇచ్చే అవకాశం లేదు. వాటర్ పైప్ లైన్ లేకుండా సీవరేజ్ కనెక్షన్ కు ఆస్కారం కూడా ఉండదు. కానీ కొందరు సిబ్బంది చేతివాటం తో వాటర్ పైప్ లైన్ లేకుండానే సీవరేజ్ కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా మన వాటర్ వర్క్స్ సిబ్బంది కే దక్కుతుంది. ఒకవేళ పాత ఇంటి స్థలంలో కొత్త నిర్మాణం చేపడుతున్న వాటికి కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే వాటర్ క్యాన్ నెంబర్ ఆధారంగానే కనెక్షన్ ఇవ్వాలి. అయినా ఈ నిబంధనలు కూడా పట్టించుకోవడం లేదు కొంతమంది సిబ్బంది.

అక్రమ కనెక్షన్ లలో వారిదే ప్రధాన పాత్ర..

అక్రమ నల్లా కనెక్షన్‌ పొందాలంటే స్థానికంగా వాటర్‌ బోర్డు క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలు లేకుండా సాధ్యమయ్యే అవకాశం ఉండదు. అక్రమ నల్లా కనెక్షన్లకు క్షేత్రస్థాయి సిబ్బంది బాహాటంగా సహకారం అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కిందిస్థాయి సిబ్బంది రెగ్యులర్‌ గా ఆయా కాలనీల్లో తిరుగుతుండడంతో అక్రమ కనెక్షన్ లను ఆదాయ వనరుగా వాడుకుంటున్నారట. ఓ ఇంటికి ఒక కనెక్షన్‌ ఉన్నా నీళ్లు సరిపోవడం లేదని వారి దృష్టికి తీసుకొస్తే అక్రమ కనెక్షన్‌ తీసుకోమని ఉచిత సలహా ఇస్తున్నారని, ఈ క్రమంలో అక్రమ కనెక్షన్‌ దారులనుండి ముడుపులు కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి ముడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఓ వర్క్ ఇన్స్పెక్టర్ నిర్వాకం ఇటీవల జీఎం దృష్టికి వెళ్లినా ఆయన చూసీచూడనట్టు వ్యవహరించారని సమాచారం.


Next Story

Most Viewed