సిట్టింగ్‌లకు తలనొప్పిగా మారిన కార్పొరేటర్లు!

by Disha Web Desk 12 |
సిట్టింగ్‌లకు తలనొప్పిగా మారిన కార్పొరేటర్లు!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్పొరేటర్లకు మొండి చెయ్యి తప్పదా? వీరి విషయంలో అన్ని పార్టీలు ఒకే విధంగా ఆలోచిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 డివిజన్లలో చాలా చోట్ల కార్పొరేటర్లు అసెంబ్లీ బరిలోకి దిగేందుకు తహతహలాడుతున్నారు. అయితే వీరి అభ్యర్థిత్వాన్ని పార్టీలు పరిగణలోకి తీసుకోవడం లేదు. బల్దియాకు 2020లో జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 డివిజన్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పదవీ బాధ్యతలు చేపట్టక ముందే లింగోజీగూడ కార్పొరేటర్ గుండెపోటుతో మృతిచెండడంతో ఈ డివిజన్‌ను హస్తం దక్కించుకుంది.

అయితే కార్పొరేటర్లుగా గెలిచిన వారిలో చాలామంది కొత్తవారు మినహాయిస్తే రెండు, మూడు, అంతకంటే ఎక్కువ సార్లు విజయాన్ని సొంతం చేసుకున్న వారు ఎమ్మెల్యే టికెట్ పై కన్నేశారు. ఇందుకు ముందుగానే పార్టీల అగ్రనాయకులను కలిసి తమ మనసులోని మాటను ఏకరువు పెట్టినప్పటికి వారు పట్టించుకోవడం లేదని సమాచారం. కొంత మందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణుని చావుకు కారణాలనేకం అన్నట్లుగా వారికి పార్టీలు టికెట్లు నిరాకరించడంలో అనేక కారణాలు ఉన్నాయనేది చర్చ జరుగుతోంది.

ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నా..?

ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లుగా కొనసాగుతున్న వారి పదవీకాలం ఇంకా రెండేళ్లకు పైగా ఉంది. ఇప్పుడు ఇదే కొంతమందికి అడ్డంకిగా మారింది. అసెంబ్లీ బరిలోకి కార్పొరేటర్లను దించితే వారు గెలుస్తారో? లేదో? తెలియకపోగా చేతిలో ఉన్న డివిజన్‌ను కోల్పోవలసి వస్తుందేమోనన్న అనుమానాలు పార్టీల రాష్ట్ర నాయకులలో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు కార్పొరేటర్లు తలనొప్పిగా మారారనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి.

తమకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాలని ఆయా పార్టీలకు చెందిన కొందిన కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. లేకపోతే పార్టీ మారుతామనే సంకేతాలను పార్టీల రాష్ట్ర నాయకులకు అందేలా చూస్తున్నారు. అనుచరులతో పోస్టులు పెట్టించేందుకు వెనుకాడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే తీరు కొనసాగుతోంది. పార్టీకి చెందిన కార్పొరేటర్లు తక్కువగా ఉన్నప్పటికీ వారి టికెట్ ప్రయత్నాలు కూడా హస్తినకు చేరుతున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

సిట్టింగ్‌లకు తలనొప్పిగా..

గ్రేటర్‌లో ప్రస్తుత, మాజీ కార్పొరేటర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారారనే టాక్ వినబడుతోంది. ముఖ్యంగా అంబర్‌పేట్, గోషామహల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వీరి సెగ అధికంగా ఉంది. అంబర్‌పేట్ బీఆర్ఎస్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు, మాజీలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు వ్యతిరేకగళం వినిపిస్తున్నారు. తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అభ్యర్థి గెలుపునకు పని చేయమని బాహాటంగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం వీరితో మంత్రి తలసాని సైతం మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వీరి పంచాయతీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది.

గోషామహల్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికి నాలుగు పర్యాయాలు బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఓ నాయకుడు టికెట్ ఆశిస్తున్నారు. అయితే పార్టీ మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో సదరు కార్పొరేటర్ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రి ది, కార్పొరేటర్ ది ఒకే కులం కావడంతో కార్పొరేటర్ అధికార పార్టీలోకి మారితే టికెట్ ఇప్పిస్తాననే హామీ మంత్రి నుంచి లభించినట్లు సమాచారం. ఖైరతాబాద్‌లో కూడా అధికార పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన విజయారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్‌లోకి మారారనే గుసగుసలు వినబడుతున్నాయి.

నిరాశలో..?

మరో రెండు నెలల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కార్పొరేటర్‌లో చాలా మంది నిరాశలో ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు టికెట్ రేసులో ఉన్నా వారికి ఆయా పార్టీలు టికెట్లు ఇచ్చే పరిస్థితులు కనబడడం లేదు. అధికార బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ పరిధిలోని గోషామహల్, నాంపల్లి సెగ్మెంట్లు మినహా ఇతర చోట్ల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించినప్పటికీ కార్పొరేటర్లు, మాజీ కార్నొరేటర్లకు అవకాశం ఇవ్వలేదు. ఇదే పరిస్థితి బీజేపీలోనూ కనబడుతోంది. అన్ని చోట్ల కొంతమంది మాజీలు కూడా టికెట్ కోసం పార్టీలు జంప్ చేస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకు కార్పొరేటర్ల రూపంలో చికాకును తెప్పిస్తున్నాయనే చర్చ గ్రేటర్‌లో జోరుగా నడుస్తోంది.

Next Story

Most Viewed