భారీ వర్ష సూచన.. మరో ఐదు రోజులు అలర్ట్

by Disha Web Desk 6 |
భారీ వర్ష సూచన.. మరో ఐదు రోజులు అలర్ట్
X

దిశ, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రానున్న మరో ఐదు రోజుల పాటు బలమైన ఈదురుగాలులతో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే శనివారం ఉదయం దంచికొట్టిన అకాల వర్షం కారణంగా సికింద్రాబాద్ కళాసిగూడలో ఓ చిన్నారి నాలాలో పడి కొట్టుకుపోయిన ఘటనతో వర్షాలంటేనే మహానగరవాసులు వణికిపోతున్నారు. ముంపు నివారణ పనులంటూ, నాలాల్లోని పూడికతీత పనులంటూ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారే తప్పా, నగరంలోని కనీసం లోతట్టు ప్రాంతాలు మునకకు గురికాకుండా కనీస చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2000 సంవత్సరంలో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పునరావృతం కాకుండా అప్పటి ప్రభుత్వం కిర్లోస్కర్ కమిటీతో అధ్యయనం చేయించింది. ఆ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా జీహెచ్ఎంసీ వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా నేడు చిన్నపాటి వర్షానికి నగరంలో ఏ ప్రాంతం మునకకు గురవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 23 ఏళ్లుగా లోతట్టు ప్రాంతాలు, మునగటం, నాలాలు, మ్యాన్ హోళ్లలో పడి జనాలు చనిపోవటం వంటి ఘటనలు జరుగుతున్నా, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు గుణపాఠాలు నేరవలేదు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో అకాల వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ శనివారం ఘటనకు సంబంధించి చిన్నారిని కోల్పొయిన ఆ కుటుంబానికి ఏం సమాధానం చెబుతారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

కళాసీగూడ ఘటనకు కమీషన్ల కక్కుర్తే కారణమా?

కళాసీగూడలో శనివారం జరిగిన ఘటనకు స్థానిక ఇంజినీర్ల కమీషన్ల కక్కుర్తే కారణమన్న వాదనలున్నాయి. కనీసం ఇక్కడ పని జరుగుతుందంటూ తెలియపరిచే బోర్టులు గానీ, బ్యారికేడ్లు గానీ ఏర్పాటు చేయకుండా పనులు జరుగుతున్నాయంటే ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించటం లేదన్న విషయం తేలిపోయింది. పనులు జరుగుతున్న తీరుపై నేరుగా కమిషనర్ కాకపోయినా ఇంజినీరింగ్ విభాగాధిపతి అయిన ఇంజినీర్ ఇన్ చీఫ్ కూడా విధి నిర్వహణలో విఫలమయ్యారని, స్థానిక ఇంజినీర్లపై వేటు వేసి చేతులు దులుపుకున్న కమిషనర్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని జనాలు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఎల్లుండి వరకు భారీ వర్షాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ వార్నింగ్ జారీ


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed