సుస్థిర జీవనవిధానం అలవరచుకోవాలి

by Sridhar Babu |   ( Updated:2023-10-03 18:10:51.0  )
సుస్థిర జీవనవిధానం అలవరచుకోవాలి
X

దిశ, చార్మినార్ : ​ స్థిరమైన నగరాలు, సుస్థిరమైన జీవన విధానానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ సిటీ కళాశాలలో అక్టోబర్ 3-4 తేదీలలో నిర్వహిస్తున్న ఇకో బూట్ కాంప్ ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూట్​ కాంప్​ పోస్టర్​ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంచనాకి మించి వేగంగా పట్టణీకరణ, నగరీకరణ పెరుగుతున్నదని, అందుకు తగినట్లుగా సుస్థిర జీవనం

కోసం అనువైన మార్గాలను అన్వేషించాలని, ఈ విషయంలో విద్యార్థులు చేసే ఆలోచనలు అమలు చేయటానికి తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. నీటి వనరుల సంరక్షణ, గృహాలు, ఆసుపత్రులలోని వ్యర్థాల నిర్వహణ, ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర విషయాలలో యువత వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. వీలైనంత వరకు పర్యావరణహిత జీవన విధానాన్ని అందరూ అనుసరించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా దేశంలో ఏ రాష్ట్రమూ సాధించని గ్రీన్ కవర్ సాధించిందని అన్నారు. ఈ కళాశాల కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాలభాస్కర్, డా.ఫరీదా తంపాల్, డా.నాగరాజు, డా.జె.నీరజ, డా.నర్మద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story