అమీన్‌పూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఐదుగురు కౌన్సిలర్లు!

by Disha Web Desk 1 |
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఐదుగురు కౌన్సిలర్లు!
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : చైర్మన్ ఒంటెత్తు పోకడలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన తరువాతే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలోనే మున్సిపల్ చైర్మన్‌పై సభ్యులు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు అదే పార్టీలో ఉండి నిరసన తెలిసిన వారిలో కొందరు ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధం కావడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ చేరనునుండడంపై ఆసక్తి నెలకొంది.

మొదటి నుంచి చైర్మన్ వర్సెస్ సభ్యులు

కొత్తగా ఏర్పడిన అమీన్‌పూర్ మున్సిపాలిటీలో మొదటి నుంచి చైర్మన్‌కు సభ్యులకు మధ్య సఖ్యత ఉండటం లేదు. మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీ సభ్యులు పోగా దాదాపుగా 15 మంది వరకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. కాగా, చైర్మన్ ఒంటెత్తు పోకడలపై సభ్యులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఏడాది క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు మీడియా ముఖంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. చైర్మన్‌తో తాడో పేడో తేల్చుకుంటామని, అవసరమైతే అవిశ్వాసానికి కూడా సిద్దం అవుతామని హెచ్చరికలు కూడా చేశారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఎవరు కూడా పార్టీ లైన్ దాటకుండా పార్టీలో ఉండి చైర్మన్‌పై నిరసన గళం విప్పిన విషయం కూడా విదితమే. సభ్యుల ఆందోళనపై అధిష్టానం స్పంధించి చర్యలు జరపడంతో ఎలాగోలా సభ్యులను శాంతింపజేశారు. చైర్మన్, సభ్యుల మధ్య అధిష్టాన పెద్దలు సఖ్యత కుదుర్చారు.

కాంగ్రెస్‌లో చేరేందుకు సర్వం సిద్ధం

బీఆర్ఎస్ పార్టీకి చెందిన అమీన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధం అయ్యారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో తమ నిరసనను తెలిసినప్పటికీ ఏం చేయలేకపోయిన కౌన్సిలర్లు ఇప్పుడు పార్టీ మారి చైర్మన్‌కు గట్టి హెచ్చరిక పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు 15 మంది వరకు ఉండగా మొదటగా ఐదుగురు కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అయ్యారు. పలు సందర్భాల్లో అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ తమకు నచ్చజెప్పారు. కానీ అతడిని ఏమీ అనలేదంటూ గుర్తు చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ మారి తమ నిరసన గళాన్ని ఎత్తాలని నిర్ణయించుకున్నారు.

మారనున్న రాజకీయ సమీకరణాలు...

అమీన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరనున్న నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో వేగంగా రాజకీయ పరిణామాలు మారనున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి ముచ్చటగా మూడో‌సారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం కోల్పోవడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కాకుండా అమీన్‌పూర్‌లో చైర్మన్‌తో కలిసి పని చేయలేకపోతున్నామని పార్టీ నాయకులైన ఆ పార్టీ కౌన్సిలర్లు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. నాయకులు పార్టీ మారుతున్న నేపథ్యంలో పటాన్‌చెరులో వేగంగా పరిణామాలు మారున్నట్లు స్పష్టం అవుతోంది.

Next Story

Most Viewed