పార్టీ మార్పు వార్తలపై స్పందించిన HYD మేయర్.. సీఎంను కలవడంపైనా క్లారిటీ

by Disha Web Desk 2 |
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన HYD మేయర్.. సీఎంను కలవడంపైనా క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని హైదరాబాద్ ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అజెండా కోసం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడిని, వారి పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం కానీ.. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దని హితవు పలికారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశానని అన్నారు.

ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా చాలా స్పష్టంగా చెప్పానని తెలిపారు. తెలంగాణ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం 1969 నుంచి కొట్లాడిన కుటుంబం తమది అని గుర్తుచేశారు. ఒక సాధారణ కార్పొరేటర్‌గా ఉన్న నన్ను, మేయర్‌గా అవకాశం ఇచ్చి గొప్ప గౌరవమిచ్చిన పార్టీకి జీవితాంతం నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, గత శనివారం మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో మేయర్ భేటీ అయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే మేయర్ పార్టీ మారబోతున్నదంటూ వార్తలు వినిపించాయి. తాజాగా.. వీటిపై మేయర్ స్పందించారు.


Next Story