జీఎస్టీ మీటింగుకు హరీశ్‌రావు గైర్హాజరు

by Dishanational1 |
జీఎస్టీ మీటింగుకు హరీశ్‌రావు గైర్హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంతో అనేక అంశాల్లో విభేదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవడంలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన గతంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హాజరుకాలేదు. ఆ శాఖ తరఫున ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్ మాత్రమే హాజరయ్యారు. ఈసారి కూడా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శనివారం జరిగిన కౌన్సిల్ మీటింగుకు మంత్రి హరీశ్‌రావు గైర్హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి రెండు రోజుల క్రితం హైదరాబాద్ పర్యటన సందర్భంగా చేసిన కామెంట్లకు మంత్రి హరీశ్‌రావు ఘాటుగానే బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ ఒకే వేదిక మీద ఉండడం కుదరకపోవచ్చని ఉదయమే ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిని బలపరిచే విధంగానే మంత్రి ఈ సమావేశానికి హాజరు కాకుండా దూరంగా ఉండిపోయారు.

గత సమావేశానికి గైర్హాజరైన ఆయన రోనాల్డ్ రోస్ ద్వారా లిఖితపూర్వకమైన అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలతోపాటు వేర్వేరు స్కీమ్‌లకు సంబంధించిన పెండింగ్ నిధులను సత్వరం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ. 24 వేల కోట్లను విడుదల చేయాలని కోరారు. బీడీ కార్మికుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ పన్నును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కానీ వీటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవకపోవడంతో సమావేశానికి హాజరైనా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతోనే దూరంగా ఉన్నారన్న వార్తలు సచివాలయ వర్గాల నుంచి వినిపించాయి. ఇకపైన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలకు హాజరుకావడం కూడా అనుమానమే.



Next Story

Most Viewed