పిల్లి తీర్థయాత్రకు బయలు దేరింది.. KCRపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెటైర్లు

by Disha Web Desk 4 |
పిల్లి తీర్థయాత్రకు బయలు దేరింది.. KCRపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధయాత్రకు బయలు దేరినట్లు మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం ఉన్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అవుతుందన్నారు. పదేళ్ల తర్వాత కేసీఆర్ కు ప్రజలు గుర్తుకు వచ్చారా? అంటూ ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఓట్ల వాతలు పడతాయన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌజ్ కే వెళ్లిపోతాని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పదేళ్ల పాపాల కు ప్రాయశ్చిత్తంగా చంద్రశేఖర్ రావు ఇప్పుడు ప్రజల దగ్గరకు వస్తున్నాడన్నారు. అంతకంటే ముందు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి బస్సు యాత్ర చేయాలని ప్రభుత్వ విప్ డిమాండ్ చేశారు.

అధికార మదంతో ప్రగతి భవన్, ఫామ్‌హౌస్ గేట్లు దాటనందుకు చేతులు జోడించి తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సంబండ వర్గాలను మోసం చేసినందుకు ప్రజల పాదల ముందు పడాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబితే కానీ, కేసీఆర్‌కు ప్రజలు యాదికి రాలేదన్నారు. ఓడించి ఇంట్లో కూర్చో పెడితే తప్ప సమస్యలు కళ్లకు కనిపించలేదా..? అని విమర్శించారు. ప్రజాపాలన చూసి ఓర్వలేక జనాన్ని రెచ్చగొట్టడానికి చేతి కర్ర పట్టుకుని మరీ కేసీఆర్ బస్సు ఎక్కుతున్నాడన్నారు. అమలవుతున్న గ్యారెంటీలు, నిమిషం కూడా పోనీ కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న తెలంగాణ ఆడబిడ్డల ఆనందాన్ని నిండు కళ్లతో కేసీఆర్ చూడాలని కోరారు. రూ.500 వందలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , 10 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, కళకళలాడుతున్న స్వయం సహాయక మహిళల దగ్గరకు వెళ్లి పరిశీలించాలన్నారు.

అప్పుడు అన్ని వర్గాలకు మోసం..

కేసీఆర్ ప్రభుత్వ హయంలో రుణమాఫీ కాకపోగా, దళిత బంధు పేరిట ఆయా వర్గాలను మోసం చేశారన్నారు. బీసీ బంధు అంటు పచ్చి మోసం చేశాడన్నారు. గొర్రెల పేరుతో యాదవ సోదరులను, చేపల పేరుతో బెస్త, ముదిరాజ్ బిడ్డలను కేసీఆర్ ప్రభుత్వం నిట్టనిలువునా ముంచిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక, నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారన్నారు. లక్ష కోట్ల వ్యయంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందన్నారు. అవినీతి కంపుతో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయన్నారు.

Next Story