గాంధీభవన్ ​మెట్లెక్కట్లే.! ఆయన వైఖరే కారణమా..?

by Disha Web Desk 4 |
గాంధీభవన్ ​మెట్లెక్కట్లే.! ఆయన వైఖరే కారణమా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీ కాంగ్రెస్ సీనియర్లంతా కొంతకాలంగా గాంధీభవన్​ మెట్లెక్కడం లేదు. ముఖ్యనేతలైన జగ్గారెడ్డి, జానారెడ్డి, జీవన్​రెడ్డి, దామోదర్​ రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాంరెడ్డి దామోదర్​రెడ్డి, విష్ణువర్ధన్​రెడ్డి తదితరులు దూరంగానే ఉండిపోయారు. ఇక పార్టీ ఎంపీలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డితో పాటు ఏఐసీసీ సెక్రటరీలు సంపత్​కుమార్, వంశీధర్​రెడ్డి కూడా విజిటర్లుగా వచ్చిపోతున్నట్లు సమాచారం. వీరే కాకుండా గతంలో కాంగ్రెస్​లో కీలకంగా వ్యవహరించిన నేతలంతా గాంధీభవన్​కు అంటీముట్టన్నట్టుగానే ఉంటున్నారు. కాంగ్రెస్​ నిర్వహించే వివిధ కార్యక్రమాలు, ప్రోగ్రామ్​లకూ ఇందులో చాలామంది హాజరే కావడం లేదు.

రాహుల్​గాంధీ ఎంపీ అనర్హత వేటును వ్యతిరేకిస్తూ.. ఇటీవల పార్టీ చేపట్టిన సత్యగ్రహ దీక్షలో కూడా ముఖ్య లీడర్లలో కొందరు పాల్గొనలేదు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది ? ఎందుకు నేతలంతా దూరంగా ఉంటున్నారు? గతంలో గాంధీభవన్‌నే నమ్మకున్న చుట్టూ తిరిగిన వారంతా ఇప్పుడు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎందుకువచ్చాయి? అనేది ప్రస్తుతం పార్టీలోనూ.. పొలిటికల్ సర్కిళ్లలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇలా ముఖ్యనేతలు పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతుండడంతో క్షేత్రస్థాయి కేడర్ కు నష్టం జరుగుతుందని పార్టీకి చెందిన పలువురు నేతలు పేర్కొంటున్నారు.

పాత కాంగ్రెస్ VS కొత్త టీమ్

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి కుర్చీ ఎక్కినప్పటి నుంచి సీనియర్​ నేతలంతా అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా మీడియా సాక్షిగానే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ క్రమశిక్షణా చర్యలు కింద నోటీసులు ఇచ్చినా మారడంలేదు. గతంలో కోమటి రెడ్డి, తాజాగా జాగ్గారెడ్డి ఎపిసోడ్​లను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేది పోయి, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ క్షేత్రస్థాయి కేడర్‌ను అయోమయంలో పడేస్తున్నారు. దీనిపై సీనియర్లు ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు.

రేవంత్ రెడ్డి వైఖరితోనే పార్టీకి దూరంగా ఉంటున్నామని.. పార్టీలోకి కొత్తగా వచ్చినోళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మొదట్నుంచి ఉన్నోళ్లను పట్టించుకోవడం లేదని కొందరు సీనియర్​ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్​ వచ్చాక టీడీపీ నుంచి కాంగ్రెస్​లోకి చేరినోళ్లకే గుర్తింపు లభిస్తుందని కొందరు నేతలు నారాజ్​ అవుతున్నారు. పార్టీ ఆధ్వర్యంలోని వివిధ కమిటీల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందని నేతలు నొక్కి చెబుతున్నారు. ఒరిజినల్​కాంగ్రెస్​నేతలెవరికి రెస్పెక్ట్​లభించడం లేదనేది సీనియర్ల వాదన.

అయితే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కొన్నివ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని, దీనిలో భాగంగా కొందరికి సహజంగానే అసంతృప్తి కలిగే అవకాశం ఉందని రేవంత్​వర్గం నేతలు అంటున్నారు. దాదాపు 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న పార్టీని శ్రమించి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టీ పీసీసీ చెందిన ఓ నేత చెప్పారు. పార్టీకి సీనియర్లు సహకరించాల్సిన అవసరముందని, పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీ అధిష్టానం సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed