ఫుడ్ ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టిన వారికే ఫ్యూచర్ : మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 4 |
ఫుడ్ ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టిన వారికే ఫ్యూచర్ : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : నినాదాలు కాదు.. విధానాలు మారాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఫిస్సీ సురాన ఆడిటోరియంలో నిర్వహించిన ‘వ్యవసాయ మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు - తెలంగాణ’ అంశంపై శుక్రవారం నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు అన్న కేంద్ర ప్రభుత్వ హామీ నినాదానికే పరిమితం అయిందని మండిపడ్డారు.

2022 పోయి 2023 సంవత్సరం కొనసాగుతుందని.. రైతుల ఆదాయం రెట్టింపు సంగతి ఏమోగానీ రైతులకు సాగు పెట్టుబడి రెట్టింపు అయిందని మండిపడ్డారు. ఆహారం లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదన్నారు. దీనికి సంబంధించిన వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యం కలిగిన రంగం అన్నారు. సాగుకు భారతదేశ నేలలు, వాతావరణం అనుకూలమైనవి అని, కానీ దానికి తగినట్లుగా దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.

అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. సాగునీరు, కరెంటు, రైతుబంధుతో వ్యవసాయరంగానికి అండగా నిలిచి రైతుబీమాతో రైతన్నలకు భరోసా ఇస్తున్నారు. మద్దతు ధరకు పంటల కొనుగోలు చేసి రైతులలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారన్నారు.

వ్యవసాయరంగం బలోపేతం అయితే ఆ రంగం మీద ఆధారపడిన ప్రజలు నాలుగైదేళ్లలో వారి కాళ్ల మీద వారు నిలబడతారన్నది కేసీఆర్ విశ్వాసం అని, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడితే మిగిలిన రంగాల మీద దృష్టిసారించవచ్చన్నారు. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నదన్నారు. ప్రభుత్వ చర్యల మూలంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలబడిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎగుమతులను పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు.

ఎగుమతులు పెంచడానికి ఏయే చర్యలు తీసుకోవాలన్నది నిపుణులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. ప్రపంచానికి సాఫ్ట్‌వేర్ సేవలు అందించడంలో భారత్ ముందున్నదని, ఒక్కరోజు దిగుమతులలో అంతరాయం ఏర్పడితే బ్రిటన్ ఆకలితో అల్లాడుతుందని, వారు ప్రపంచానికి ఏమీ ఎగుమతి చేయడం లేదన్నారు. అన్నింటికి దిగుమతుల మీదే ఆధారపడుతుందన్నారు. మానవాళికి అవసరమైన దైనందిన అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడడం అనివార్యమైందని, వాణిజ్య ఒప్పందాలు లేకుండా దేశాలు మనుగడ సాగించడం అసాధ్యమన్నారు.

అది లేకుండా జీవితం లేదన్నారు. ప్రపంచానికి భారతదేశ రైతుల సేవలు అత్యంత ఆవశ్యం అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆకలితీర్చేందుకు భారతదేశం కేంద్ర బిందువుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద దృష్టిపెట్టిన వారికి భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రపంచ అవసరాలు, డిమాండ్ ఉన్న ఉత్పత్తుల మీద దృష్టిసారించాలని కోరారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ కన్నా భారత్‌లోని వేరుశెనగలో ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయన్నారు.

అప్లాటాక్సిన్ రహిత తెలంగాణ వేరుశెనగకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నదన్నారు. ఉచిత చేపపిల్లలతో మత్స్య పరిశ్రమ, సబ్సిడీ గొర్రెలతో గొర్రెల పెంపకం ప్రోత్సాహంతో తెలంగాణలో గణనీయంగా వాటి ఉత్పత్తి పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, టీఎస్టీపీసీ జేఎండీ విష్ణువర్దన్ రెడ్డి, ఫిస్సీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed