కొత్త సెక్రటేరియట్‌లో ఫుల్ ప్రాబ్లమ్స్.. సిబ్బందికి తప్పని తిప్పలు

by Disha Web Desk 4 |
కొత్త సెక్రటేరియట్‌లో ఫుల్ ప్రాబ్లమ్స్.. సిబ్బందికి తప్పని తిప్పలు
X

కొత్త సెక్రటేరియట్‌లో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సందర్శకులకూ ఇబ్బందులు తప్పడం లేదు. సచివాలయం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా.. ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. చాంబర్లు ఇరుకుగా ఉన్నా సర్దుకుపోతున్న ఉద్యోగులు.. ఫర్నీచర్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఫైల్స్ భద్రపర్చుకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఎలుకలు కొరికేస్తాయని భయపడుతున్నారు. ఏసీలు సైతం సరిగ్గా పని చేయకపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు దోమల బెడద అధికంగా ఉండడంతో ఏ చాంబర్ లో చూసిన అటెండర్స్ మస్కిటో బ్యాట్స్‌తో డ్యూటీలు చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ముహూర్తం బాగుందని నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ఏప్రిల్ 30న సెక్రటేరియట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నెల రోజులుగా 500 మంది కార్మికులు పని చేస్తూనే ఉన్నా.. ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. సెక్రటేరియట్ వెనుక భాగంలో కన్‌స్ట్రక్షన్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు స్కై‌లాంజ్‌ల నిర్మాణానికి మరో రెండు, మూడు నెలల టైమ్ పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. చాలా చోట్ల ఏసీలు పనిచేయడం లేదని ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిసింది. ఒకదగ్గర రిపేర్ చేయగానే మరోచోట ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు సమాచారం. హడావుడిగా డోర్స్ బిగించడం, విండోస్ ఏర్పాటు చేయడంతో కొన్ని చోట్ల ఫర్నీచర్ వర్క్స్ పూర్తికాలేదని ఉద్యోగులు చెప్తున్నారు.

ఫైళ్లకు భద్రత కరవు

పైల్స్ భద్రపర్చుకోవడానికి ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత ఫర్నీచర్ ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దని కండీషన్ పెట్టడంతో, బీఆర్కే భవన్ లోని బీరువాలను అక్కడే వదిలేసి వచ్చారు. కొత్త సెక్రటేరియట్ లో ర్యాక్స్ లేకపోవడంతో పైల్స్ భద్రపర్చడం ఉద్యోగులకు తలనొప్పిగా మారింది. కీలకమైన పైల్స్ ను ఎక్కడ పెట్టాలో తెలియక కొందరు అధికారులు బీఆర్కే నుంచి పాత బీరువాలో తెప్పించి, అందులో పెట్టి లాక్ చేశారు. దీంతో అందరూ మళ్లీ పాత బీరువాలను తెచ్చుకునే పనిలో ఉన్నారు. కొన్ని సెక్షన్స్ లో ఎలుకలు తిరుగుతున్నాయని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. దీంతో పైల్స్ ను భద్రంగా ఉంచడం పెద్ద సమస్యగా మారిందని ఆవేదన చెందుతున్నారు.

ప్రతి అటెండర్‌కు ఓ దోమల బ్యాట్

కొత్త సెక్రటేరియట్ లో దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమలు రాకుండా ఉండేందుకు కిటికీలకు ఎలాంటి రక్షణ చర్యలు లేవు. దీంతో దోమలు ప్రతి చాంబర్ లో దర్శనమిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు అటెండర్లకు దోమల బ్యాట్లను అందించినట్లు తెలిసింది. ప్రతి రోజు డ్యూటీకి రాగానే, దోమలను చంపేందుకు బ్యాట్లకు పని చెప్తున్నారు.

అందుబాటులోకి రాని పోలీస్ రెస్ట్ రూమ్

సెక్రటేరియట్ సెక్యూరిటీ కోసం ప్రతి షిప్ట్ లో సుమారు 600 మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. వీరు డ్యూటీ ముగిసిన తర్వాత రెస్ట్ తీసుకునేందుకు అవకాశం లేదు. సెక్రటేరియట్ వెనుక భాగంలో పోలీసుల కోసం రెస్ట్ రూమ్ కు స్థలం కేటాయించారు. అక్కడ బిల్డింగ్ పనులు పూర్తయినా, ఇంటీరియర్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో సెక్రటేరియట్ గోడల చుట్టూ సేద తీరుతున్నారు. వాష్ రూమ్ లేక పోవడంతో మహిళా కానిస్టేబుల్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిన్న పిల్లలున్న ఎంప్లాయీస్ కు అవస్థలు

సెక్రటేరియట్ వెనుక భాగంలో ఉద్యోగుల పిల్లల కోసం ప్లే స్కూల్ ను నిర్మిస్తున్నారు. అది పూర్తవడానికి మరో రెండు, మూడు నెలల సమయం పట్టొచ్చు. దీంతో చిన్న పిల్లలున్న మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలను ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొనసాగుతున్న స్కూల్ లో వదిలి, సెక్రటేరియట్ వరకు రావడానికి అవస్థలు పడుతున్నారు.

విజిటర్స్‌కు టాయిలెట్స్ కరువు

సెక్రటేరియట్ కు ప్రతి రోజు వివిధ పనుల నిమిత్తం 300 మంది వరకు సందర్శకులు వస్తున్నారు. అయితే సరిపడా టాయిలెట్ ఫెసిలిటీ లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ ప్లేస్ లో నిర్మించిన టాయిలెట్స్ ఇద్దరు, ముగ్గురికే సరిపోతాయి. వాటిని కూడా కొన్ని రోజులుగా శుభ్రం చేయకపోవడంతో కంపు వాసన కొడుతున్నదని విజిటర్స్ వాపోతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed