ఆస్కార్‌తో తెలుగువారి ఖ్యాతిని పెంచిన ఓరుగల్లు బిడ్డ

by Disha Web Desk 2 |
ఆస్కార్‌తో తెలుగువారి ఖ్యాతిని పెంచిన ఓరుగల్లు బిడ్డ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఒక‌టి కాదు.. రెండు కాదు.. వంద‌లు కూడా కాదు.. వేల పాట‌లతో తెలుగు సినిమా జ‌గ‌త్తును ముంచెత్తాడు. చాలా సాధార‌ణ మాట‌ల‌తో పాట‌లు కట్టాడు. గొప్ప గ్రంథాల‌ను అవ‌పోస‌న ప‌ట్టాడు.. ఒక పాట‌లో గుదిగుచ్చాడు. సినీ శ్రోత‌లు స్ఫూర్తిదాయ‌కంగా పాడుకునేలా చేశాడు. గ్రామీణ జ‌న‌ప‌దాల‌తో పాట‌ల‌ను కైగట్టిన చంద్రబోస్‌.. మంచు కొండ‌ల్లోన సంద్రమా..! అంటూ పాట ప్రస్థానాన్ని ఆరంభించి నాటు.. నాటు పాట‌తో ఆస్కార్ వేదిక దాకా చేరాడు. ఓరుగ‌ల్లు గ‌డ్డపై పుట్టిన బిడ్డ.. లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ అవార్డును అందుకుని ముద్దాడుతుంటే ముర‌వ‌ని తెలుగోడు లేడంటే ఆశ్చర్యం లేదు. చంద్రబోస్ అందిన అవ‌కాశాన్ని ఒడిసి ప‌ట్టుకుని త‌న ర‌చ‌నా ప్రతిభ‌తో అంచెలంచెలుగా ఎదిగిన తీరు నేటిత‌రానికి స్ఫూర్తిదాయకం.

పల్లె మాట‌ల‌ను పాట‌లుగా అల్లి..

ఎన్నెన్నో స్ఫూర్తిదాయ‌క పాట‌లు.. మ‌రెన్నో ఆలోచింప‌జేసే గేయాలు.. ఇంకెన్నో మాస్‌, ర‌సజ్ఞత క‌లిగిన సినిమా పాటలు చంద్రబోస్ రాశారు. పామ‌రుడికి సైతం అర్థమ‌య్యే రీతిలో పాట‌లు రాయ‌డంలో ఆయనకే చెల్లింది. పల్లె మాట‌ల‌ను పాట‌లుగా అల్లి జ‌నాలంద‌రినోట పాడించ‌డం ఆయ‌న‌కే సాధ్యమైంది. పాట రాయ‌డానికి భాషాపాండిత్యం అక్కర్లేద‌ని నిరూపించిన సినీగేయ రచ‌యిత. తెలుగు సినీ సాహిత్య దిగ్గజ ర‌చ‌యిత‌ల స‌ర‌స‌న ఎప్పుడో చేరారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు.. నాటు పాటతో ప్రపంచ సినీ వేదిక‌పైనా మెరిశారు. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం పొందగా.. తాజాగా ఆస్కార్ అవార్డు కూడా వరించడంతో తెలుగు సినిమా రేంజ్ అందరూ అబ్బురపడేలా ప్రపంచస్థాయికి చేరుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంజినీరింగ్ చదుపుతున్నప్పుడే చాన్స్..

చంద్రబోస్ ది జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం చల్లగరిగె గ్రామం. తండ్రి నర్సయ్య టీచర్. తల్లి మదనమ్మ గృహిణి. నలుగురి సంతానంలో చంద్రబోస్ చివరివాడు. చంద్రబోస్‌కు బాల్యం నుంచే పాట‌లంటే అమితమైన ఇష్టం. కాలేజీ రోజుల్లో వార్తాప‌త్రిక‌ల‌కు ర‌చ‌న‌లు పంపేవాడు. అవి అచ్చయితే.. చల్లగరిగేతోపాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఎంతో ఆస‌క్తిగా చ‌దివేవారు. చంద్రబోస్ డిప్లమో, ఆ తర్వాత ఇంజినీరింగ్ చదివాడు. పూర్తయ్యాక పాటలపై మరింతగా ఆసక్తి పెరిగింది. ఎలాగైనా సినిమాల్లో పాట‌లు రాయాల‌నే ల‌క్ష్యంతో ప్రయ‌త్నాలు ప్రారంభించాడు. ఇంజినీరింగ్ లో ఉండగానే దర్శకుడు ముప్పలనేని శివ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన తాజ్‌మహల్ సినిమాలో అన్ని పాట‌లు రాసే చాన్స్ వచ్చింది. అందులోని మంచుకొండల్లోన చంద్రమా.. అనేపాట ప్రేక్షకుల ఆద‌ర‌ణ‌ను పొందింది.

దీంతో చంద్రబోస్ ర‌చ‌న శైలి సినీ పరిశ్రమకు తెలిసిపోయింది. అప్పడే ఇంజినీరింగ్ పూర్తయింది. జాబ్ నా.. సినీ ఇండస్ట్రీలోకి వెళ్లడమా అని ఆలోచించుకుని.. రెండోదాన్నే ఎంచుకుని తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమాలో పాటలు రాశారు. ఆ సినిమా మ్యూజికల్ సక్సెస్ కావడంతో ఆయనకు వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. ఆ త‌ర్వాత ఆయ‌న టాలీవుడ్ అగ్ర సినీ గేయ ర‌చ‌యిత‌ల్లో ఒక‌రిగా ఎదిగారు. 2000 నుంచి 2015 సంవత్సరం వ‌ర‌కు చంద్రబోస్ పాటల హ‌వా కొన‌సాగింది. ఆ మ‌ధ్య కాలంలో వంద‌లాది సినిమాల్లో ఆయన పాట‌లు వినిపించాయి.

Next Story

Most Viewed