పోడు పట్టాల ఇష్యూ.. కేసీఆర్‌కు ఫోరం కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ

by Disha Web Desk 2 |
పోడు పట్టాల ఇష్యూ.. కేసీఆర్‌కు ఫోరం కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూములు సాగుచేస్తున్న ఆదివాసీ రైతులకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం 1940లో ఒకసారి, 1964లో మరోసారి, 2005లో మూడోసారి పోడు భూములపై ఆదివాసీలకు సాగు హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన ఆ తర్వాత వచ్చిన కేంద్ర అటవీ పరిరక్షణ చట్టం, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం సుమారు 11.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లు తేల్చారని, ఆయన లెక్కల ప్రకారం చూస్తే ఒక్కో ఎకరానికి సగటున రూ. 25 లక్షల చొప్పున ఆ భూముల విలువ దాదాపు రూ. 2.30 లక్షల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి నిర్దిష్ట విధానం రూపొందించేటప్పుడు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 2005కు పూర్వం సాగులో ఉన్నవాటికి మాత్రమే అనే నిబంధన పెట్టాలని సూచించారు. తెలంగాణలో ఒకవైపు అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఓట్ల కోసం పోడు భూములకు పట్టాల పేరుతో అడవుల విధ్వంసం జరుగుతూ ఉన్నదని గుర్తుచేశారు. ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో 2005 తర్వాత పోడుగా మారిన అటవీ భూములను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా గుర్తించి వాటికి మాత్రమే పట్టాలు ఇవ్వాలని, ఆ తర్వాత పోడు భూములుగా సాగులోకి వచ్చినవాటి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలని పద్మనాభరెడ్డి సూచించారు. అటవీ భూములు కేవలం ఆదివాసీలకు చెందినవి మాత్రమే కావని మొత్తం జనాభా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించినవనే విషయాన్ని ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలని సూచించారు.

అడవులను ఇటీవల ఆక్రమించి పోడు భూములుగా మారినవాటి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండాలని, తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోడు భూములకు అటవీ హక్కులు మంజూరు చేసేటప్పుడు, పట్టాలు ఇచ్చేటప్పుడు కేంధ్ర అటవీ పరిరక్షణ చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరించాలని కోరారు. ఇందుకోసం గతం నుంచీ అమలవుతున్న గ్రామ సభ, సబ్ డివిజనల్ కమిటీ, కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ లాంటి వ్యవస్థలకు అదనంగా ప్రత్యేక (విచారణ) కమిటీని వేసి ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా 2005 కంటే ముందు మాత్రమే సాగులో ఉన్నవాటికి వర్తింపజేయాలని సూచించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005కు ముందు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం 2006లో అమలైందని, సుమారు లక్ష మంది లబ్ధిదారులకు 3.31 లక్షల ఎకరాల అటవీ భూమి పంపిణీ అయిందని పద్మనాభరెడ్డి గుర్తుచేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతున్న సమయంలో పద్మనాభరెడ్డి ఈ లేఖ రాయడం గమనార్హం.



Next Story

Most Viewed