CM రేవంత్ రెడ్డికి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారు.. వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
CM రేవంత్ రెడ్డికి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారు.. వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఎంబ్లంలో కాకతీయ తోరణం, చార్మినార్ వంటి చారిత్రక గుర్తులు ఉన్నాయని తెలిపారు. సామాన్య ప్రజల కోసం కాకతీయులు పరితపించారని గుర్తుచేశారు. చార్మినార్ అంటే హైదరాబాద్ గుర్తు అని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గుర్తులను చెరిపివేసేలా ఎవరో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చరిత్రను మరిపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై ఆంధ్రా మేధావుల ప్రభావం ఉందని అన్నారు. రాష్ట్ర చిహ్నంలో ఎలాంటి మార్పులు చేయొద్దని తాము కోరుతున్నామని తెలిపారు. కాగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు చట్టం చేయనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయని అందుకే వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు చెప్పారు.



Next Story

Most Viewed