‘తమ్ముడు KTR.. ఆ విషయం మర్చిపోయావా?’.. మాజీ MP మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
‘తమ్ముడు KTR.. ఆ విషయం మర్చిపోయావా?’.. మాజీ MP మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంతో మంది నిరుద్యోగులు తమ తల్లుల పుస్తల తాళ్లను తాకట్టు పెట్టి మరీ, ఏళ్ల తరబడి నుంచి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారని, ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయాలంటే ఎంత వరకు కరెక్ట్..? అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. దుర్మార్గమైన డిమాండ్ ముందుకు తెచ్చి నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ చెలగాటమాడుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తున్నామన్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షల షెడ్యూలు విడుదల చేశామన్నారు. నిరుద్యోగులు స్వేచ్ఛగా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, కావాలనే కుట్ర చేసి పరీక్షలను ఆపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం ఉన్నదన్నారు. ప్రధానంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ట్రైనింగ్ సెంటర్ల స్వార్థం ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు. శిక్షణ పేరుతో కోట్లాది రూపాయల మాఫియా నడుస్తుందన్నారు. పరీక్షలు వాయిదాలు వేస్తే, ఫీజుల పేరుతో నిరుద్యోగుల రక్తం తాగుదామని చూస్తున్నారన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు నియమించి కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ ను కోరారు.

ఇక ‘‘తమ్ముడు.. అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు కొనేందుకు కూడా డబ్బులు లేని రోజులను మర్చిపోయావా?, తెలంగాణ రాక ముందు మీ అయ్యా కొడుకులు, రబ్బరు చెప్పుల మీ బావ ఆస్తులు ఎన్ని..? ఇప్పుడు మీ ఆస్తులు ఎంతో లెక్క చెప్తావా..? ” అని మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. దుబాయిలో ఆస్తులు ఎట్లా కూడబెట్టారో తెలియదనుకున్నారా..? అని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకున్నది చాలక సిగ్గు లేకుండా, ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నదని విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై కార్యకర్తల్లో కొంత ఆందోళన ఉన్నమాట వాస్తవమే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు చెమటోడ్చి తమ రక్తాన్ని ధారపోశారని అనేక కేసులు ఎదుర్కొని నిలబడ్డారని గుర్తు చేశారు. వారందర్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కొత్త వారి చేరికతో నిజమైన కార్యకర్తల్లో ఆందోళన ఉన్నప్పటికీ.. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో తప్పడం లేదని క్లారిటీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేశారని, సీఎంగా బాధ్యతల కారణంగా.. పీసీసీ ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే వారికి పీసీసీగా అవకాశం ఉంటుందన్నారు.

Next Story

Most Viewed