తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలే: మాజీ మంత్రి పొన్నాల

by Disha Web Desk 19 |
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలే: మాజీ మంత్రి పొన్నాల
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50శాతం ప్రజల మద్దతు కూడా తెచ్చుకోలేక పోయిందని ఆరోపించారు. కనీసం 50 శాతం సీట్లు కూడా సాధించలేక పోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో వెనకబడిన వర్గాలు గెలవలేక పోతున్నాయని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేస్తుంది, బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. సర్వేలను అడ్డం పెట్టుకొని బీసీలపై కాంగ్రెస్ పార్టీ ప్రయోగాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలేనన్నారు.

ప్రజల మద్దతు పొందే ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయని, వారి మద్దతు పొందిన పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తాయన్నారు. తెలంగాణలో ఎక్కువగా ఉన్న బీసీల మద్దతు పొందడంలో కాంగ్రెస్ విఫలమైందని, కేవలం ఒక వర్గానికి చెందిన పార్టీగా మిగిలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు అవమానాలకు గురి అవుతున్నారన్నారు. బీసీ కులగణన జరగాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని, ఆ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ స్థానాలను ఇతరులకు కేటాయించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నుండి పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీలో చేరారని, అవమానంతోనే పార్టీ మారినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. 54 శాతం ఉన్న బీసీల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని బీసీలు క్షమించరని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed