కేసీఆర్ సీక్రెట్స్ రివీల్ చేసిన ఈటల.. ‘దిశ’ స్పెషల్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి..!

by Disha Web Desk 19 |
కేసీఆర్ సీక్రెట్స్ రివీల్ చేసిన ఈటల.. ‘దిశ’ స్పెషల్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి..!
X

దిశ: మల్కాజిగిరికి మీరు నాన్-లోకల్ గదా..!

ఆ లాజిక్ కరెక్టు కాదు. ఆ స్థానంలో రేవంత్‌రెడ్డి, వయనాడ్‌లో రాహుల్‌గాంధీ, మెదక్‌లో ఇందిరాగాంధీ, బళ్లారిలో సోనియాగాంధీ, నంద్యాలలో పీవీ నర్సింహారావు.. వీరంతా లోకల్ క్యాండిడేట్లా..? నేను తెలంగాణ ఉద్యమంలో ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు. రాష్ట్రమంతా యాక్టివ్‌గా పాల్గొన్నా. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నా రాష్ట్ర మంత్రిగా అన్నీ నాకు సమానం. నేను ఒక నియోజకవర్గానికి, జిల్లాకు చెందినవాడిని కాను. రాష్ట్రమంతా నా ప్రాంతమే. ఈ నియోజకవర్గంతో నాకు 32 ఏండ్ల అనుబంధం ఉంది.

= అక్కడ విజయావకాశాలు ఎలా ఉన్నాయి..?

వంద శాతం నేనే గెలుస్తున్నా. బీఆర్ఎస్ రాష్ట్రంలో బలహీనమైంది. కాంగ్రెస్‌తో పెద్దగా పోటీ లేదు. ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల స్పందన నాకు కనిపిస్తున్నది. మా పార్టీ చేయిస్తున్న సర్వే ఫలితాలూ అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు నన్ను బలంగా కోరుకుంటున్నారు.

= ఇంత పెద్ద నియోజకవర్గంలో అర్బన్ ఓటర్లే ఎక్కువ..

రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం. ఎక్కువ ఓటర్లు ఉన్నారు. దీనికి తోడు కాస్మోపాలిటన్ కల్చర్ ఇక్కడ ఉన్నది. కానీ ఇక్కడకు వలస వచ్చి బతుకుతున్నవారిలో ఎక్కువగా తెలంగాణ గ్రామాల నుంచి వచ్చినవారే. కొంతమంది ఉత్తరాది రాష్ట్రాల నుంచీ వచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ ఈటల రాజేందర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఉత్తరాది రాష్ట్రాలవారికి మోడీ చరిష్మా, పదేండ్ల పాలనతో సంబంధం ఉన్నది. నాకున్న వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు బీజేపీ, మోడీ పట్ల ఉన్న పాజిటివ్ వేవ్ బాగా ఉపయోగపడుతుంది.

= కానీ ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలూ బీఆర్ఎస్‌వే గదా..!

నిజమే. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పవర్‌లోకి రాదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. బీఆర్ఎస్ గెలిచినా ప్రయోజనం లేదని తేల్చుకున్నారు. ప్రజలకు యాక్సెస్‌లో ఉండే ఈటలతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమనే నమ్మకానికి వచ్చారు.

= రేవంత్‌రెడ్డి సిట్టింగ్ సీటును చేజార్చుకుంటారా..?

నిజమే.. రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ. కానీ ఐదేండ్లలో ఆయన ఈ నియోజకవర్గానికి చేసింది పెద్దగా లేదు. అభివృద్ధిపై ఆయన దృష్టి పెట్టలేదు. నియోజకవర్గాన్ని పట్టించుకున్నదీ లేదు. ఇప్పుడు నేను ప్రచారం చేస్తున్నప్పుడు కూడా రేవంత్ గురించి ఇవే చెప్తున్నారు. దానికి తోడు ఆయన లాగా ఉండొద్దు.. అని ముఖం మీదనే చెప్తున్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర వైద్య మంత్రిగా నేను చేసిన సర్వీస్‌ను గుర్తుచేసుకుంటున్నారు. నా గురించి వారికి తెలుసు కాబట్టే నన్ను ఆదరిస్తున్నారు. గెలిపిస్తారు.

= స్టేట్‌లో పవర్‌లో ఉండి లైట్‌‌గా తీసుకుంటుందా..?

ప్రజలకు కావాల్సింది వారి సౌకర్యాలు తీరడం, సమస్యలకు పరిష్కారం లభించడం. అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారెంటీలంటూ కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. ఎన్ని అమలు చేసింది? ప్రజలు వీటిని ప్రశ్నించవద్దనే అసెంబ్లీలో వైట్ పేపర్, జ్యుడిషియల్ ఎంక్వయిరీ, విజిలెన్స్ దర్యాప్తు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, మేడిగడ్డ.. ఇలాంటి అంశాలతో హడావిడి చేస్తున్నది. హామీలను అమలు చేయడానికి అవసరమైనంత ఆర్థిక వనరులు లేవు. సరిపోవన్న సంగతి ప్రభుత్వానికీ తెలుసు.

= అయినా కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారు గదా..!

అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించుకున్నది ప్రేమతో కాదు.. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పట్ల ఉన్న కోపంతో. రేవంత్ సీఎం అవుతారని ప్రజలకు ముందు తెలియదు. కానీ నాలుగు నెలల రేవంత్ పాలనతో ప్రజలకు స్పష్టత వచ్చింది. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు పవర్‌కు దూరమయ్యాయి. భవిష్యత్తులో తెలంగాణలోనూ అదే జరుగుతుంది. కేంద్రంలో రాహుల్ ఎలాగూ ప్రధాని కాలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం రాదని తెలుసు. కాంగ్రెస్‌కు నిజంగా ఆ ధీమా ఉంటే రాహుల్‌గాంధీ కేరళకు వెళ్లేవాడే కాదు. సోనియాగాంధీ పోటీ చేయకుండా ఉండేవారు కాదు.

= మీ గెలుపులో మోడీ ఇమేజ్ ఏ మేరకు..?

నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ప్రధాని మోడీ మల్కాజిగిరిలో రోడ్ షో నిర్వహించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పదేండ్ల పాలనలో ప్రధాని మోడీపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు. అన్ని సెక్షన్ల ప్రజల మనసును చూరగొన్నారు. కుల మత భేదాలు లేకుండా అందరూ ఆయన పాలనను కీర్తిస్తున్నారు. మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తే దేశానికి అవసరమనే అభిప్రాయంతో ఉన్నారు. నా పట్ల అభిమానం, మోడీ పట్ల నమ్మకం, బీజేపీ పట్ల ఉండే ధీమా.. ఇవన్నీ కలగలిసే ఉంటాయి.

= కాంగ్రెస్ అధికార బలం, కేసీఆర్ రాజకీయం ఎఫెక్టు ఎంత..?

అధికారంలో ఉన్న కాంగ్రెస్ సత్తా ఏంటో నాలుగు నెలల్లో ప్రజలకు అనుభవమైంది. ఐదేండ్లు ఎంపీగా ఉన్న రేవంత్ ఇక్కడి ప్రజలకు, ప్రాంత అభివృద్ధికి చేసిందేందో స్వీయానుభవం. ఇక కేసీఆర్ రాజకీయం గతంలో ఉన్నంత ఇప్పుడు లేదు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలే వెళ్లిపోతుంటే ఆపలేకపోతున్నారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వెళ్లిపోతున్నారు. ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి చూపడంలేదు. ఒకప్పటి కేసీఆర్‌కు, ఇప్పటి కేసీఆర్‌కు తేడా ఉన్నది.

= మిమ్మల్ని పార్టీ నుంచి పంపించారనే కోపమా..?

కేసీఆర్ మనస్తత్వం ఆ పార్టీలో పనిచేసిన నాకు బాగా తెలుసు. ఎవరైనా ఆయన మాటకు ఎదురుచెప్తే సహించలేరు. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయరు. పవర్‌లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయనలోని తేడా మాకు అర్థమైంది. నిజానికి కేసీఆర్ వ్యక్తిత్వంలో మార్పు 2015లోనే ప్రారంభమైంది. కేబినెట్ సమావేశాల్లో మంత్రులతో షేర్ చేసుకోకుండానే, వారి అభిప్రాయాలతో సంబంధం లేకుండానే కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేవారు. ఒక రాజులాగానే వ్యవహరించారు. భిన్నాభిప్రాయాలను వినడానికే సిద్ధపడలేదు. ఉద్యమ సమయంలో పార్టీలో ఉన్న స్వేచ్ఛ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు.

= దీన్ని ప్రశ్నించినందుకే సస్పెండ్ చేశారా..?

నాలాంటివారిని బయటకు పంపడం, అవమానించడం ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. మంత్రులమే అయినా మా మీద మాకు తెలియకుండానే నిఘా కొనసాగేది. మేం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకునేవారు. మా కుటుంబ సభ్యులు, పీఏల ఫోన్లు ట్యాపింగ్ అయ్యేవి. రాజయ్యను డిప్యూటీ సీఎంగా తొలగించిందే ఇలాంటి వ్యవహారంతో. ఆయనతో విభేదించేవారిపై ప్రతీకారం తీర్చుకునేవారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

= ఫోన్ ట్యాపింగ్ గురించి ముందే తెలుసా..?

2015లోనే నలుగురైదుగురు మంత్రులం మాట్లాడుకునేటప్పుడు ఈ విషయం మాకు అర్థమైంది. తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎంగా తొలగించినప్పుడు స్పష్టత వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అప్పటి నుంచే ఉన్నది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం చేయాల్సిన ట్యాపింగ్‌ను మాపైనే ప్రయోగించారు. ప్రత్యేకంగా ఎక్విప్‌మెంట్‌ను తెప్పించారు. ఈ మధ్య కస్టడీలోకి తీసుకున్న తర్వాత కన్ఫెషనల్ స్టేట్‌మెంట్లలో చాలా విషయాలు బయటకు వచ్చినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నా.

= కేంద్రానికి ఫిర్యాదు చేయలేదెందుకు..?

నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ గురించి పట్టించుకోలేదు. ఉప ఎన్నికలో మళ్లీ గెలిచాను. పాలిటిక్స్ మీదనే దృష్టి పెట్టాను. ఇప్పుడు కూడా నాకు ఆ అంశంపై ఆసక్తి లేదు. కానీ ఇటీవల ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు రావడంతో, మీడియాలో వార్తలు రావడంతో స్పందించాల్సి వచ్చింది. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అలాంటి విధానాలనే అనుసరిస్తుందనే అనుమానాలున్నాయి.

= మీదేమో లెఫ్ట్ ఐడియాలజీ.. బీజేపీలో ఎలా చేరారు..?

ఐడియాలజీ ఏదైనా అంతిమంగా ప్రజల బాగు కోసమే. లెఫ్టిస్ట్.. రైటిస్ట్.. ఎవరైనా ప్రజల కోసమే సిద్ధాంతాలను రూపొందించుకుంటారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్నదే నా అభిమతం. కొన్ని పనులు ఎవరు చేసినా అవి సమాజానికి మేలు చేసేటట్లయితే సమర్థించాల్సిందే. ఉదాహరణకు ప్రతి ఇంటికీ టాయ్‌లెట్ నిర్మాణం అనే బీజేపీ స్కీమ్‌ను ఆహ్వానించాల్సిందే. కమ్యూనిస్టులైనా దీన్ని వ్యతిరేకిస్తారా..?

= బీఆర్ఎస్‌తో పాటు మీరు కూడా 2023 ఎన్నికల్లో ఓడిపోయారు..

కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం ప్రగతి భవన్‌లో మంత్రులు కూడా అపాయింట్‌మెంట్ లేకుండా వెళ్లే వెసులుబాటు లేదు. ప్రజలకు అది నిషిద్ధ ప్రాంతం. ఆయనను విమర్శించే సాహసం పార్టీ లీడర్లకు లేదు. ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, గృహనిర్బంధం. చివరకు ధర్నా చౌక్ కూడా లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో ఇవి మనం ఊహించలేకపోయాం. చివరకు అవే ఆయనకు, పార్టీకి ప్రతిబంధకంగా మారాయి. పవర్ నుంచి దింపేందుకు కారణాలయ్యాయి. నేను ఓడిపోడానికి కూడా నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి.

= బీజేపీకి తెలంగాణలో ఫ్యూచర్ ఉన్నదా..?

బీఆర్ఎస్, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్‌ను ప్రజలు అధికారంలో కూర్చోబెట్టారు. వంద రోజుల్లో హామీల అమలు, ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న పాలనతో ప్రజలకు ఈ పార్టీపైనా అసంతృప్తి ఉన్నది. ఎన్ని కారణాలను కాంగ్రెస్ తెరమీదకు తెచ్చినా ప్రజలకు మాత్రం నమ్మకం సడలింది. ప్రత్యామ్నాయం బీజేపీ అని బలంగా భావిస్తున్నారు. తప్పకుండా బీజేపీకి భవిష్యత్తు ఉన్నది.

= 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఎన్ని గెలుస్తుంది..?

నాకున్న రాజకీయ అనుభవం మేరకు పన్నెండు స్థానాల్లో గెలిచే అవకాశమున్నది. పార్టీ చేయించుకుంటున్న సర్వేల్లోనూ ఇదే వెల్లడైంది. మిగిలినచోట్ల మేం సెకండ్ ప్లేస్‌లో ఉంటాం. గట్టిగా కొట్లాడితే అక్కడా ఫలితం అనుకూలంగా మారొచ్చు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా మేం గెలవడం ఖాయం. దేశంలో 400 స్థానాల్లో గెలుస్తాం. మళ్లీ మోడీ ప్రధాని అవుతారు. కాంగ్రెస్ గెలిచేదీ లేదు.. రాహుల్ ప్రధాని అయ్యేదీ లేదు.

= బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం నిజమేనా..?

బీజేపీకి, బీఆర్ఎస్‌కు మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ లేదా లోపాయికారి ఒప్పందం ఉన్నదనేది శుద్ధ తప్పు. నాకు తెలిసినంత వరకు అది పొలిటికల్ కామెంట్‌కే పరిమితం. ప్రజలను గందరగోళంలో పడేయడానికి, పొలిటికల్ మైలేజ్ పొందడానికి కాంగ్రెస్ లాంటి పార్టీలు చేసే విమర్శలు మాత్రమే.

= అదే నిజమైతే రెండు పార్టీలూ కాంగ్రెస్ ప్రభుత్వం కష్టమే అనే కామెంట్లు ఎందుకు వస్తున్నాయి..?

ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం మాకు లేనే లేదు. అలాంటి అవసరమూ లేదు. కానీ కాంగ్రెస్ వైఫల్యాలు, ఆ పార్టీ అంతర్గత అంశాలే కారణం కావొచ్చు. ప్రజలు బీజేపీవైపు ఉన్నారనేది వాస్తవం. తెలంగాణలో మా పార్టీకి భవిష్యత్తు పుష్కలంగా ఉన్నది. మేం ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతాం. అందుకే చాలా మంది మా పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రేవంత్ సర్కారు ఐదేండ్లూ కొనసాగాలనే కోరుకుంటున్నాం.

= కాంగ్రెస్‌లో కూడా చేరుతున్నారు గదా..!

బీఆర్ఎస్‌కు 2018 ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నారు. చివరకు మూడింట రెండొంతుల మంది నిబంధనతో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్‌లో విలీనం చేయించారు. ఇప్పుడు రేవంత్ చేస్తున్నదీ అదే. నిజానికి ఫిరాయింపు చట్టానికి బీజం వేసింది రాజీవ్‌గాంధీ. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో కూడా ఫిరాయింపును ప్రోత్సహించబోమని చెప్పుకున్నది. కానీ ఆ పార్టీకి చెందిన రేవంత్ మాత్రం అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ఫిరాయింపుల్లో కేసీఆర్‌తో రేవంత్ పోటీ పడుతున్నారు.

= బీజేపీ కూడా ఈడీ, ఐటీ కేసులతో బెదిరిస్తున్నది..!

ఆ రెండూ దర్యాప్తు సంస్థలు. వాటికి స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి. బీజేపీకి వాటితో సంబంధం లేదు. బీజేపీలో చేరిన తర్వాత కేసులు కొట్టేసినట్లు చాలా మంది ఆరోపిస్తున్నారు. కానీ అది నిజం కాదు. వారిమీద కేసులు అలానే ఉన్నాయి. దర్యాప్తు ఎప్పుడు, ఎలా చేయాలో ఆ సంస్థలు చూసుకుంటాయి. బీజేపీకి అంటగట్టడం సరైంది కాదు.

= కవిత అరెస్టు అందులో భాగమేనా..?

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయడం సీబీఐ, ఈడీలకు సంబంధించిన వ్యవహారం. ఆధారాలు, సాక్ష్యాలు, నిందితుల స్టేట్‌‌మెంట్లు.. ఇలాంటివి కారణం. ఆ అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదు. ఆ అంశంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన కూడా మాకు లేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాణానికి బొమ్మా బొరుసూ వంటి కామెంట్లు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపవు. అసెంబ్లీ ఎన్నికల్లోనే అది తేటతెల్లమైంది.

= అసెంబ్లీ ఎన్నికల నాటికంటే బలం పెరుగుతుందా..?

అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో బీజేపీకి ఒక్కటే సీటు ఉన్నది. కానీ ఇప్పుడు ఎనిమిది సీట్లు వచ్చాయి. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ గ్రాఫ్ ఓట్ల షేరింగ్, సీట్ల సంఖ్యలో బాగా పెరుగుతుంది. మా అంచనాలు మాకున్నాయి. ప్రజలు కూడా స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. డజను సీట్లకు ఢోకా లేదు.

= బండి సంజయ్‌తో విభేదాలెందుకు..?

పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు సహజం. కానీ ఆయనతో నాకు విభేధాలున్నాయనే ఆరోపణలు మాత్రం తప్పు. ఇద్దరం చాలా వేదికల మీద కలిసే కూర్చున్నాం. ఇద్దరం పార్టీ సమావేశాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. సంస్థాగత వ్యవహారాల్లో నేతల ఆలోచనల్లో తేడాలు సహజం. వాటిని పార్టీ నాయకత్వంతో జరిగే చర్చలప్పుడు డిస్కస్ చేసుకుంటాం. బండి సంజయ్‌తో నాకు పడదని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వస్తున్న పుకార్లే.



Next Story

Most Viewed