గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల కోసం.. రోజుకు రూ. 191 కోట్ల పేమెంట్

by Rajesh |   ( Updated:2024-06-19 02:10:03.0  )
గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల కోసం.. రోజుకు రూ. 191 కోట్ల పేమెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ఇప్పటికే అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ సర్కార్ ప్రతి రోజూ రూ.191 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోందంటూ వస్తున్న విమర్శలు ఉన్నా పాత అప్పుల కోసం క్రమం తప్పకుండా పేమెంట్ చేయడానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రంగా ఉన్నా తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన అనంతరం లోటు బడ్జెట్‌గా మారిందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. అప్పుడు రూ.70 వేల కోట్లలోపే అప్పు ఉండేదని, బీఆర్ఎస్ పాలనలో అది పది రెట్లు పెరిగి ఏడున్నర లక్షల కోట్లకు చేరుకుందని కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఆర్థిక వేత్తల ఆందోళనలు ఒకవైపు, బడ్జెట్ లెక్కల్లోకి రాకుండా కార్పొరేషన్ల పేరుతో ఎడాపెడా అప్పులు చేసిందన్న కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలు మరోవైపు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎఫ్ఆర్‌బీఎం ఆంక్షలు విధించి రిజర్వు బ్యాంకుకు సర్క్యులర్ జారీ చేసింది. ఆర్బీఐ నుంచి ప్రతి నెలా తీసుకునే మార్కెట్ బారోయింగ్స్ లిమిట్‌కు కోత పెట్టింది. కొన్ని ద్రవ్య సంస్థలు రుణం ఇవ్వడానికి కూడా నిరాకరించాయి. దీనికి తోడు గతంలో బ్యాంకుల కన్సార్షియం, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లాంటి పలు ద్రవ్య సంస్థల నుంచి తీసుకున్న రుణాల ‘అసలు’ వాయిదాల చెల్లింపు స్టార్ట్ కావడంతో ఆ భారం ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై పడింది.

స్టేట్ ఫైనాన్స్ డిపార్టుమెంటు ద్వారా అందిన గణాంకాలను పరిశీలిస్తే రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న రుణాలకంటే గత ప్రభుత్వం తీసుకున్న అప్పుల ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ పేమెంట్ కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. గతేడాది డిసెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది మొదలు ఈ ఏడాది జూన్ 17 వరకు పాత అప్పుల ప్రిన్సిపల్, వడ్డీ చెల్లింపుల కోసం చేసిన ఖర్చు ఎక్కువగా ఉంది. ఈ ఆరున్నర నెలల కాలంలో పాత అప్పులు, వడ్డీల చెల్లింపుల కోసం రూ. 38,040 కోట్లను చెల్లిస్తే కొత్తగా తీసుకున్న అప్పు రూ. 25,118 కోట్లుగా తేలింది. సగటున ప్రతిరోజు రూ. 191 కోట్లను పాత అప్పుల పేమెంట్ కోసం పక్కన పెట్టాల్సి వస్తోందని ఫైనాన్స్ డిపార్టుమెంటు ద్వారా తెలిసింది.

వెల్లడైన గణాంకాలను పరిశీలిస్తే...

రోజుకు రూ. 191 అప్పులు, వడ్డీల చెల్లింపు

2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ 17 వరకు 199 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ. 25,118 కోట్లు

పాత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను ‘అసలు’, వడ్డీల రూపంలో చెల్లించింది రూ.38,040 కోట్లు

Also Read: సర్కారు కసరత్తుతో హై టెన్షన్.. బీఆర్ఎస్‌కు ‘రుణమాఫీ’ భయం!

Advertisement

Next Story