96 జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం.. అందించనున్న మీడియా అకాడమీ

by Disha Web Desk 19 |
96 జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం.. అందించనున్న మీడియా అకాడమీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి 96 జర్నలిస్టు కుటుంబాలకు, బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హోటల్ టూరిజం ప్లాజాలో చెక్కుల పంపిణీ చేయనున్నారు. "సంక్షేమ నిధి -పాత్రికేయుల పెన్నిధి" పేరిట ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు, పని చేయలేని, నిస్సహాయ స్థితిలో ఉన్న 672 జర్నలిస్టులకు, ప్రభుత్వం ఏర్పరచిన 42 కోట్ల జర్నలిస్టుల సంక్షేమ నిధి మూలధనంపై వచ్చిన వడ్డీతో మీడియా అకాడమీ చెక్కుల పంపిణీ చేయనుంది.

ఇప్పటివరకు మీడియా అకాడమీ ఈ నిధి ద్వారా నేడు పంపిణీ చేస్తున్న చెక్కులతో కలుపుకొని మొత్తం 19,01,21,000 రూపాయల ఆర్థిక సహాయం జర్నలిస్టులకు సహాయం అందుతుంది. జర్నలిస్టుల కుటుంబానికి లక్ష రూపాయలతో పాటు, ఐదు సంవత్సరాలవరకు నెలకు 3000 పెన్షన్ అందజేస్తారు. పనిచేయలేక నిస్సహాయ స్థితిలో జర్నలిస్టులకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.

చనిపోయిన జర్నలిస్టుల పిల్లలు ఎల్‌కే‌జీ నుండి 10వ తరగతి వరకు చదువుకోవడానికి ట్యూషన్ ఫీజ్ కొరకు ఒక్కక్కరికి నెలకు 1000 రూపాయలు అకాడమీ అందజేస్తుంది. కరోనా సమయంలో ఆ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న 4000 జర్నలిస్టులకు, సంక్షేమ నిధి నుండి ఏడు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్, అశోక్ రెడ్డి, జర్నలిస్టు నాయకులు అతిథులుగా పాల్గొననున్నారు.


Next Story

Most Viewed