కోవిడ్ గ్రూప్ కార్మికుల గుర్తింపునకు కసరత్తు

by Disha Web Desk 12 |
కోవిడ్ గ్రూప్ కార్మికుల గుర్తింపునకు కసరత్తు
X

దిశ, సిటీబ్యూరో: కోవిడ్ ప్రబలినప్పుడు మహానగరంలోని వీఐపీ ప్రాంతాల్లో కెమికల్స్ స్ప్రే చేసేందుకు నియమించిన 202 మంది కార్మికుల్లో ఎంతమంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నరన్నది జీహెచ్ఎంసీలో మిస్టరీగా మారింది. ఈ విషయాన్ని ధృవీకరించాల్సిన జోనల్ అసిస్టెంట్, సీనియర్ ఎంటమాలజిస్టులు చేతులెత్తేసినట్లు సమాచారం. కోవిడ్ వంటి ఎమర్జెన్సీ సమయంలో ఆ కార్మికులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహించినందుకు వారిని రోడ్డున పారేయరాదన్న కమిషనర్ సంకల్పం మేరకు గత మార్చి నెలాఖరుతో ముగిసిన ఆ గ్రూప్‌ల కాంట్రాక్టు గడువును మరో ఆరు నెలలు పెంచి, వారిని గుర్తించి, వారిని ఎంటమాలజీ విభాగంలో విలీనం చేయాలని భావించిన కమిషనర్ ఆ గ్రూప్‌లు జాబితాను అడగ్గా, ఎంటమాలజీ విభాగం సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయం అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం.

అంటే కొవిడ్ గ్రూప్‌లు అన్నవి ఫేకా? నిజంగానే ఏర్పాటు చేశారా? ఎంత మందితో ఎన్ని గ్రూప్‌లను ఏర్పాటు చేశారన్న అనుమానాలు రెకెత్తాయి. పైగా ఎంత మంది పని చేశారన్న అనుమానాలు రెకెత్తుతున్నాయి. దీంతో ఆ కార్మికులను గుర్తించే బాధ్యతను కమిషనర్ జోనల్ కమిషనర్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్, సీనియర్ ఎంటమాలజిస్టులందరూ ఆ కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు. కానీ జోనల్ కమిషనర్ తన పరిధిలోకి వచ్చే సర్కిల్ స్థాయి మెడికల్, ఎంటమాలజీ విభాగం అధికారులిచ్చే జాబితానే కమిషనర్‌కు సమర్పించే అవకాశమున్నట్లు చర్చ జరుగుతుంది. వారిచ్చే జాబితా ఎంతవరకు పారదర్శకమైంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

తిలా పాపం తలా పిడికెడు..

కొవిడ్‌లో కెమికల్స్ స్ప్రే చేసేందుకు నియమించిన కార్మికుల నియామకం మొదలుకుని భారీగా మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఎంటమాలజీ విభాగం అధికారులు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీరికి డైలీ రూ.600 చెల్లించాల్సి ఉండగా, అధికారులు కేవలం రూ.300 నుంచి 400 వరకు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. పైగా గత మార్చి నెలాఖరు వరకు 202 మంది కార్మికుల జీతాలను క్లెయిమ్ చేసిన ఎంటమాలజీ విభాగం అధికారులు ఇప్పుడు వారి జాబితా అడిగితే చేతులెత్తేయటం వారు అవినీతికి పాల్పడ్డారనేందుకు నిదర్శనం. నియామకం మొదలుకుని మార్చి జీతం చెల్లించే వారు వారి శ్రమను దోచుకున్న అవినీతి అసిస్టెంట్ ఎంటమాజిస్టు మొదలుకుని జోనల్ కమిషనర్ వరకు తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కొవిడ్ గ్రూప్‌లు ఏర్పాటు చేయాలన్న ఓ ముఖ్య అధికారి ఆలోచన ఎవరికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Next Story

Most Viewed