వైన్ షాపుల దరఖాస్తుల స్వీకరణ షురూ

by Dishafeatures2 |
వైన్ షాపుల దరఖాస్తుల స్వీకరణ షురూ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: 2023–25 సంవత్సరాలకుగాను ఓపెన్​కేటగిరీలో ఉన్న వైన్​షాపులకు శుక్రవారం ఎక్సయిజ్ ​అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. శనివారం సాయంత్రం 5గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కాగా ఓపెన్​ కేటగిరీలో ఉన్న వైన్స్​ కోసం మొదటి రోజు దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చినట్టు సమాచారం.ఇదే ట్రెండ్​కొనసాగితే ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేకపోవటంతో ప్రభుత్వం ఈసారి రెండు నెలల ముందుగానే వైన్ షాపు టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదట గౌడ్లు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్​చేసిన దుకాణాల కేటాయింపులను పూర్తి చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వీటిలో 15శాతం గౌడ కులస్తులకు రిజర్వ్ చేశారు.

ఇక, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో గురువారం ఈ రిజర్వ్ చేసిన దుకాణాలను లాటరీ నిర్వహించటం ద్వారా కేటాయించారు. జిల్లా ఎక్సయిజ్​ అధికారి, వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారితో కలిసి ఉన్న కమిటీ సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ తీసి షాపుల కేటాయింపులు జరిపారు. రాష్ర్టం మొత్తం మీద ఎస్టీలకు ఇదివరకే కేటాయించిన 95 షాపులను వీటి నుంచి మినహాయించారు. రిజర్వేషన్ల రకారం గౌడ్లకు 393, ఎస్సీలకు 262, మినహాయించినవి పోగా 5 శాతం రిజర్వేషన్​ప్రకారం ఎస్టీలకు 36 దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించారు.

ఓపెన్ కేటాగిరీలో..

ఇక, రిజర్వ్​చేసిన షాపుల కేటాయింపులు జరిపిన తరువాత 1,834 వైన్​షాపులు ఓపెన్​కేటగిరీలో మిగిలాయి. అధికారులు వీటికి శుక్రవారం నుంచి దరఖాస్తులను తీసుకోవటం ప్రారంభించారు. మొదటి రోజు స్పందన బాగానే వచ్చిందని ఎక్సయిజ్​శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుదారు 2లక్షల రూపాయల నాన్​రిఫండబుల్​ఫీజు కట్టి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో కొంతమంది అయిదు నుంచి పది షాపులకు దరఖాస్తులు చేసుకున్నట్టుగా తెలియచేశారు. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉన్న నేపథ్యంలో క్రితంసారి రికార్డు చెరిగిపోవచ్చన్నారు. 2021లో వైన్​షాపులకు టెండర్లు ఆహ్వానించినపుడు 57వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు చెప్పిన ఎక్సయిజ్​అధికారులు ఈసారి వాటి సంఖ్య 70వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


Next Story