మీ బతుకులు ఎందో ఎవడికి తెలియదురా!.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
మీ బతుకులు ఎందో ఎవడికి తెలియదురా!.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ భారీన పడేసి, ఆ నీళ్లను ఆంధ్రప్రదేశ్ కి అమ్మి, సీఎం రాజశేఖర్ రెడ్డి బిక్షతో కోమటిరెడ్డి సోదరులు ఆస్తులు సంపాదించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కారు ప్రమాదంలో చనిపోయిన బీఆర్ఎస్ నేత జనార్ధన్ రావు కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొమటిరెడ్డి సోదరులపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యకర్తలపై పడ్డ కేసులను తన మీద వేసుకొని జైలుకు పోయిన చరిత్ర తనదని, ప్రజల కోసం ఎన్ని సార్లైనా జైలుకు వెళతానని సూచించారు. మీరు ప్రజల సొమ్ము తిన్న దొంగలని, ఎప్పటికైనా జైలుకు వెళ్లేది మీరేనని ఆరోపించారు.

ఇక ఆస్తుల గురించి తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఊర్లకు వెళ్లి వాళ్లవి మావి చరిత్రలు తీయాలని, తాను పుట్టినప్పుడు తన ఆస్తి ఎంతో, వాళ్ల ఆస్తులేంటో, వాళ్ల బ్రతుకులు ఎంటో బయటకి తీయాలని రిపోర్టర్లను కోరుతున్నాని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆగర్బ శ్రీమంతులమని, పుట్టడమే బంగ్లాలో పుట్టామని చెప్పుకోవడానికి సిగ్గుండాలి, మీ బతుకులు ఎందో ఎవడికి తెలియదురా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే నల్లగొండ జిల్లా ప్రజల రక్తం తాగి, వారిని ఫ్లోరోసిస్ బారిన పడేసి, నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు అమ్మి, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన బిక్షతో ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ క్లబ్బుల్లో లక్షరూపాయల వాచీలు, కళ్లద్దాలు పెట్టుకొని ఫోజులు కొట్టేది మీరేనని, తాను నిత్యం ప్రజలతో ఉండేవాడినని చెప్పుకున్నారు. తనకు పర్సనల్ చేసుకొని మాట్లాడటం ఇష్టం ఉండదని, అందుకే ఎప్పుడూ మాట్లడలేదని, వీరి మాటలు విని గోబెల్స్ కూడా సిగ్గుపడతాడని అన్నారు. ఎవరిని తిడుతున్నారో వాళ్ల కాళ్లు పట్టుకుంటారని, మీడియా ముందు ఒకవిధంగా, బయట మరో విధంగా ఉంటారని విమర్శించారు. తనకు ఆ అవసరం లేదని, నిఖార్సైన ఉద్యమకారుడ్ని అని, మీరు నా గురించి, కేసీఆర్ గురించి మాట్లడాటానికి సిగ్గుండాలని, మీ బతుకులు ఎందో చూసుకోవాలని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed