తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేయడానికి కారణం ఇదే: మంత్రి

by Disha Web Desk 2 |
తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేయడానికి కారణం ఇదే: మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆహారానికి ప్రత్యామ్నాయం లేదని, అందుకే వ్యవసాయానికి, వ్యవసాయ అనుకూల విధానాలకు తెలంగాణలో పెద్దపీట వేస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో ‘వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు పెంపొందించడం’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వ్యవసాయ రంగానికే ఇస్తుందన్నారు. 65 లక్షల మంది రైతులు 51 శాతం భూ విస్తీర్ణంతో కోటీ 50 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 18.2 శాతం ఆదాయం సమకూరుస్తుండడం గర్వకారణమన్నారు.

కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలే ఈ విజయానికి కారణమని స్పష్టం చేశారు. రైతాంగం వ్యవసాయం వైపు దృష్టి మళ్లించడంతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, యువత సైతం వ్యవసాయాన్ని ఒక ఉపాధి రంగంగా ఎంచుకుంటోందని తెలిపారు. వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచడానికి వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామన్నారు. వివిధ రాష్ట్రాలలో ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి పండే పంటల ఆధారంగా దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే వ్యవసాయరంగంపై కేంద్రంలోని ప్రభుత్వాల దృక్పథం మారాలన్నారు.

ఎగుమతుల వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువను పెంచే ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం, పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించ లేకపోవడం శోఛనీయమన్నారు. వ్యవసాయరంగ వృద్ధి కోసం, ఉత్పత్తులకు విలువ కోసం కేరళ ప్రభుత్వం సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ కేరళ అధ్యక్షుడు సావియో మాథ్యూ, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకుడు సుధీర్, కేరళ పరిశ్రమల బ్యూరో జీఎం వన్‌రాయ్, తెలంగాణ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకుడు రవికుమార్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed