9 గంటలు.. వందల ప్రశ్నలు.. మరీ MLC కవిత ఏం సమాధానం చెప్పారంటే..!

by Disha Web Desk 19 |
9 గంటలు.. వందల ప్రశ్నలు.. మరీ MLC కవిత ఏం సమాధానం చెప్పారంటే..!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆఫీసులోకి వెళ్లిన ఆమె.. రాత్రి 8 గంటలకు బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అధికారులు ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇక విచారణలో భాగంగా ఆఫీసర్లు ఆమెపై ప్రశ్నలు వర్షం కురిపించారని ఈడీ వర్గాల సమాచారం. ఈ నెల 16వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను ఆదేశించింది. కవిత ఈడీ ఆఫీసులోనికి వెళ్లినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఉత్కంఠ నెలకొన్నది. సుమారు 9 గంటల పాటు ఏయే అంశాలపై ప్రశ్నించారన్నది అటు ఈడీ అధికారులు గానీ, ఇటు కవిత గానీ వెల్లడించలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో చోటుచేసుకున్న అవకతవకలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు శనివారం ప్రశ్నించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు అనేక ప్రశ్నలకు ఆమె నుంచి సమాధానాలను రాబట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. మధ్యలో నాలుగింటికి గంట పాటు భోజనం కోసం విరామం ఇచ్చిన ఈడీ.. ఆ తర్వాత కూడా మహిళా అధికారి సమక్షంలో విచారించింది. మనీ లాండరింగ్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే పలువురు ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని అంశాలపై కవిత నుంచి వివరాలను రాబట్టింది.

ఏయే అంశాలపై తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారన్నది అటు ఈడీ అధికారులుగానీ, ఇటు కవిత గానీ వెల్లడించలేదు. దీంతో ఈ సుదీర్ఘ ఎంక్వయిరీలో ఏయే అంశాలపై ఈడీ వివరాలను సేకరించిందనేది బైటకు రాలేదు. లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో సౌత్ గ్రూపు మంతనాలు జరిపిందని, ఆ గ్రూపులో కవిత కూడా ఒకరుగా ఉన్నారని ఈడీ ఇప్పటివరకూ చార్జిషీట్లలో, పలువురి స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని స్పెషల్ కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టుల్లో ఈడీ వ్యాఖ్యానించింది.

ఈ స్కామ్‌లో ఏయే అంశాల్లో కవితకు ఎలాంటి సంబంధం ఉన్నదోననే అనుమానాలను వ్యక్తం చేసినందున.. వాటికి సంబంధించి ఆమె నుంచి వివరాలను తీసుకున్నట్టు తెలిసింది. సౌత్ గ్రూపులో కవిత తరఫున ప్రతినిధిగా వ్యవహరించానంటూ అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ఈడీ అధికారులకు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని అంశాలను కూడా కవిత దగ్గర ప్రస్తావించి ఆమె వివరణ తీసుకున్నట్టు సమాచారం. గతంలో ఆమెకు వ్యక్తిగత ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబు స్టేట్‌‌మెంట్‌లో పేర్కొన్న అంశాలపై కూడా ఈడీ ఆరా తీసినట్టు తెలిసింది.

జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణలో..

ఎమ్మెల్సీ కవితను ఎంత మంది అధికారులతో కూడిన టీమ్ ప్రశ్నించిందనే వివరాలు అధికారికంగా వెలుగులోకి రాకపోయినా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించినట్టు తెలిసింది. సాయంత్రం సమయానికి మహిళా ఆఫీసర్‌ను కూడా ఈ టీమ్‌కు అటాచ్ చేసినట్టు తెలిసింది. సౌత్ గ్రూపు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్ల మేర అడ్వాన్స్ కిక్‌బ్యాక్ రూపంలో చేరిన డబ్బు, అందుకోసం ఎంచుకున్న హవాలా మార్గం, ఏ అవసరాల కోసం వీటిని ఇవ్వాల్సి వచ్చింది, ఈ డబ్బు ఎవరిది, ఎవరికి ఇవ్వడానికి ఉద్దేశించింది తదితర వివరాలను ఆమె నుంచి రాబట్టినట్టు సమాచారం. రెండు విడతల్లో మొత్తం రూ.130 కోట్లు సౌత్ గ్రూపు నుంచి ఆప్ నేతలకు వెళ్లింది నిజం కాదా అనే విషయంపైనా ప్రశ్నించినట్టు తెలిసింది.

ఎక్సయిజ్ పాలసీ అఫీషియల్‌గా పబ్లిక్ డొమెయిన్‌లోకి రావడానికి ముందే సిగ్నల్ మొబైల్ యాప్ ద్వారా చేరడం, దానిపై వాట్సాప్ ద్వారా చాటింగ్ జరగడం, పలువురితో హైదరాబాద్‌లోని కోహినూర్ హోటల్‌లో చర్చలు జరగడం, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు దక్కడం, ఆమ్ ఆద్మీ పార్టీతో పొలిటికల్ అండర్‌స్టాండింగ్ ఏర్పడడం తదితరాలపై కవిత నుంచి సమాధానాలను తీసుకున్నట్టు తెలిసింది. కొన్ని నెలల వ్యవధిలోనే పది ఫోన్లను మార్చాల్సి రావడం, అందులోని డిజిటల్ ఎవిడెన్సులను మాయం చేయడంపైనా ఈడీ ఆరా తీసినట్టు సమాచారం. డిజిటల్ ఆధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయాల్సిన అవసరంపై కూడా ఆమె నుంచి వివరణను తీసుకున్నట్టు ఈడీ వర్గాల సమాచారం.

మొబైల్ ఫోన్‌ను తీసుకున్న ఈడీ

కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఎంక్వయిరీ కోసం ఫోన్‌ను ఆమె తన వెంట తీసుకురాకపోయినా భోజన విరామం అనంతరం జరిగిన విచారణ సందర్భంగా సెక్యూరిటీ ద్వారా ఆమె వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి తుగ్లక్ రోడ్డులోని నివాసం నుంచి ఫోన్‌ను తెప్పించుకున్నట్టు తెలిసింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారం మొబైల్ ఫోన్ల ద్వారా జరిగిన చాటింగ్, సంభాషణలు, సంప్రదింపుల డాటా ఇప్పటికే ఈడీ దగ్గర ఉన్నందున ప్రస్తుతం ఆమె వాడుతున్న ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నది.

ఈడీ ఆఫీసు వద్ద బీఆర్ఎస్ నేతల హడావుడి

ఎంక్వయిరీ కోసం హాజరు కావాలంటూ ఈడీ నోటీసు జారీ చేయడంతో తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ నుంచి ఈడీ సెంట్రల్ ఆఫీసు వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు హడావుడి చేశారు. నివాసం వద్ద వందల సంఖ్యలో జాగృతి కార్యకర్తలు, మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు కవితకు అనుకూలంగా, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ ఇచ్చిన టైమ్ ప్రకారం ఉదయం 11 గంటలకు ఆమె బయలుదేరాల్సి ఉన్నా ఏడు గంటల నుంచే ఇంటి దగ్గర హంగామా మొదలైంది. రాజకీయ కక్షసాధింపు కోసమే ఈడీ వేధిస్తున్నదంటూ తప్పుపట్టారు. ఎంక్వయిరీకి హాజరుకావడానికి ముందు మహిళా కార్యకర్తలకు, జాగృతి వలంటీర్లకు పిడికిలితో కవిత అభివాదం చేస్తూ చిరునవ్వుతో బయలుదేరారు.

నివాసం దగ్గర వందలాది మంది గుమికూడడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై బలగాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇంటి చుట్టుపక్కల సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు వారికి అర్థం చేయించారు. ఆమె నివాసం నుంచి బయలుదేరేంత వరకూ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బారికేడ్లను పెట్టాల్సి వచ్చింది. ఆమెతో పాటు భర్త అనిల్, న్యాయవాది కూడా ఉన్నా సెక్యూరిటీ సిబ్బంది.. కవితను మాత్రమే ఈడీ ఆఫీసులోకి అనుమతించారు. ఈడీ ఆఫీసు వద్ద శ్రేణులు భారీగా మోహరించడంతో పారామిలిటరీ బలగాలు 500 మీటర్ల దూరం వరకూ ఆంక్షలు విధించాయి. సాయంత్రం తర్వాత పార్టీ శ్రేణులను అక్కడి నుంచి పంపించివేశారు. విచారణ అనంతరం కవిత బయటకు రావడంతో.. ఆమెను అనుకూలంగా నినాదాలు చేశారు.

తెలంగాణ భవన్ వద్ద నిరసనలు

కవితను ఈడీ ఎంక్వయిరీకి పిలవడాన్ని తప్పుపట్టిన మహిళలు, పార్టీ కార్యకర్తలు, జాగృతి వలంటీర్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంక్వయిరీకి వెళ్లిపోయిన తర్వాత బండి సంజయ్ మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయన దిష్టిబొమ్మను తెలంగాణ భవన్ దగ్గర దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళ అనే స్పృహ మరిచి అనుచితంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకూ ఆందోళనలు జరగడంతో నిరసనల వేడి కొనసాగింది. భవన్ వెలుపలా, ఆ తర్వాత లోపలా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. విచారణ తర్వాత తుగ్లక్ రోడ్డుకు చేరుకున్న కవితకు మహిళలు దిష్టితీసి హారతితో స్వాగతం పలకడంతో పాటు అనుకూల నినాదాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు.

పిళ్లయ్‌తో కలిసి విచారించినట్లు వార్తలు

కవితను తొమ్మిది గంటల పాటు విచారించినప్పుడు రెండో సెషన్‌లో అరుణ్ పిళ్లయ్‌ను కూడా ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్టు వార్తలు వచ్చినా ఈడీ వర్గాలు మాత్రం వాటిని ధ్రువీకరించలేదు. కవితను ఎంక్వయిరీ చేస్తున్న ప్రాంగణంలోనే వేరే గదుల్లో సిసోడియా, అరుణ్ పిళ్లయ్‌లు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఎక్కువగా పిళ్లయ్, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని వివరాలను ఆధారంగా చేసుకుని కవిత నుంచి రాతపూర్వకంగా ఈడీ వివరాలను రాబట్టింది. బినామీగా వ్యవహరించడం, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు దక్కడం, సౌత్ గ్రూపునకు 9 రిటైల్ జోన్లకు లైసెన్సులు మంజూరు కావడం, కొంతకాలం పాటు లిక్కర్ పాలసీ అమలైనందున భారీగా లాభాలు రావడం.. ఇలాంటి విషయాలన్నింటిపైనా ఆరా తీసినట్టు సమాచారం.

కవిత ఎదుర్కొన్న ప్రశ్నల్లో కొన్ని.. (ఈడీ వర్గాల సమాచారం ప్రకారం)

- ఢిల్లీ లిక్కర్ వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి?

- పాలసీలో మార్పులు చేయాలన్న ప్రతిపాదనలు ఎవరివి?

- అందులో మీ ప్రమేయమేంటి? ఇంకా ఎవరెవరున్నారు?

- సౌత్ గ్రూప్‌లో మీ రోల్ ఏంటి? ఎవరెవరు ఉన్నారు?

- సిసోడియా మీతో మాట్లాడింది నిజమేనా?

- అరుణ్ పిళ్లయ్‌తో మీకున్న వ్యాపార సంబంధమేంటి?

- లిక్కర్ స్కాంలో పిళ్లయ్ మీకు బినామీగా వ్యవహరించారా?

- హైదరాబాద్ కోహినూర్ హోటల్‌లో జరిగిన చర్చల్లో మీ తరఫున పాల్గొన్నది ఎవరు?

- హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన హవాలా డబ్బుతో మీకున్న సంబంధమేంటి?

- ఢిల్లీకి చార్టర్డ్ ఫ్లైట్‌ను సమకూర్చిందెవరు? ఎందుకోసం?

- ఇండో స్పిరిట్స్ కంపెనీలో మీకు వాటా దక్కింది నిజం కాదా?

- పిళ్లయ్ ద్వారా సమీర్ మహేంద్రుతో ఫేస్‌టైమ్‌లో ఏం మాట్లాడారు?

- కొన్ని నెలల్లోనే పది ఫోన్లను ఎందుకు మార్చారు? అవి ఎక్కడ ఉన్నాయి?

- అందులోని డిజిటల్ ఎవిడెన్సులను ఎందుకు ధ్వంసం చేశారు?

- ఆడిటర్ బుచ్చిబాబు, శరత్‌చంద్రారెడ్డితో మీకున్న లిక్కర్ వ్యాపార సంబంధాలేంటి?

Also Read: సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ మౌనం వహించిన MLC కవిత!

Next Story

Most Viewed