తొమ్మిదేళ్లుగా ఒకే చోట డ్యూటీ.. పెద్దసార్ గుప్పిట్లో ఐటీడీఏ..!

by Disha Web Desk 4 |
తొమ్మిదేళ్లుగా ఒకే చోట డ్యూటీ.. పెద్దసార్ గుప్పిట్లో ఐటీడీఏ..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : తొమ్మిదేళ్లుగా ఏటూరునాగారం ఐటీడీఏలో పాతుకుపోయిన పెద్ద‌సార్ ఆడింది ఆట‌.. పాడింది పాట‌గా సాగుతోంద‌ని స‌మాచారం. అంతా నా ఇష్టం అనే శీర్షిక‌తో ఏప్రిల్ 30న దిశ‌లో ఐటీడీఏలో తిష్ట‌వేసిన పెద్ద‌సార్‌పై క‌థ‌నం ప్ర‌చురించిన విష‌యం పాఠ‌కుల‌కు తెలిసిందే. దిశ క‌థ‌నం ఏజెన్సీలో, గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో, ఏటూరు నాగారం గిరిజ‌న స‌మ‌గ్రాభివృద్ధి సంస్థ కార్యాల‌య ఉద్యోగులు, అధికారుల్లో సంచ‌ల‌నం సృష్టించింది. క‌థ‌నం రాసిన దిశను కొంత‌మంది ఫోన్లో బెదిరింపుల‌కు పాల్ప‌డే ప్ర‌య‌త్న‌ం చేశారు.

అయితే అదే స‌మ‌యంలో సార్ మ‌మ్మ‌ల్ని కూడా ముప్ప‌తిప్ప‌లు పెడుతున్నారంటూ ప‌లువురు గిరిజ‌నులు ఫోన్‌లో సంప్ర‌దించ‌డం గ‌మ‌నార్హం. రుణాలు స‌మ‌కూరుస్తామంటూ డ‌బ్బుల వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా దిశ‌తో చెప్పారు. తొమ్మిదేళ్లుగా ఐటీడీఏలో పాతుకుపోయిన అధికారిపై ఇంట‌లిజెన్స్ అధికారులు స‌మాచారాన్ని సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. స‌ద‌రు అధికారి ప‌నితీరు, ఐటీడీఏలో జాబ్‌చార్ట్‌, ఫైల్స్ పెండింగ్‌, అధికారుల విధుల్లో జోక్యం, ప‌రిధి దాటి ఏమైనా వ్య‌వ‌హ‌రించారా..? వంటి అంశాల‌పై కూడా శాఖ‌లోని కొంత‌మంది ద్వారా సమాచారం సేక‌రించిన‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది.

పెద్దసార్ మార్క్ అక్ర‌మాలు..?!

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తొమ్మిదేళ్లుగా ఒకే సీటులో పాతుకుపోయి.. పెద్ద‌సార్‌గా ప్ర‌సిద్ధి పొందుతున్న అధికారి అక్ర‌మాల‌పై అనేక ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ట్రైకార్ రుణాలు, గిరి వికాసం ప‌థ‌కాలలో అవినితి, అక్ర‌మాలు భారీ ఎత్తున జ‌ర‌గ‌గా, అందులో స‌ద‌రు అధికారి పాత్రే కీల‌కంగా ఉంద‌ని స‌మాచారం. అయితే త‌న చేతికి మ‌ట్టికి అంట‌కుండా కిందిస్థాయి అధికారులు, సిబ్బంది చేత అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా రికార్డుల నిర్వ‌హ‌ణ‌, ఆయా ప‌థ‌కాల‌కు ల‌బ్ధిదారుల ఎంపిక‌లో సార్ త‌న మార్కు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. నిజాయితీ గ‌ల అధికారుల‌పై వివ‌క్ష చూపుతూ, టార్గెట్‌గా చేసుకుని వేధించిన‌ట్లుగా కూడా ఆరోప‌ణ‌లున్నాయి. అంతేకాకుండా ఐటీడీఏ పాల‌న‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించడ‌మే కాకుండా, అక్ర‌మాల‌కు ఆల‌యంగా మారుస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లున్నాయి.

తొమ్మిదేళ్లుగా..ఉన్న‌తాధికారులు తోడుగా..!

ప్ర‌భుత్వ ఉద్యోగి స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏటూరునాగారం ఐటీడీఏలో పెద్ద‌సారు తొమ్మ‌దేళ్లుగా ఒకేచోట విధులు నిర్వ‌హిస్తున్న విష‌యం ప‌లుమార్లు శాఖ అధికారుల దృష్టికి చేరింది. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా విచార‌ణ జ‌రిగింది లేదు. మొత్తంగా స‌ద‌రు అధికారిని ఉన్న‌తాధికారులు కావాల‌నే కాపాడుతున్నారా..? అధికారి బ‌దిలీ కాక‌పోవ‌డం వెనుక ఉన్న‌తాధికారుల‌, ఉదాసీన‌త‌, ఇంకా ఏమైనా లాభాపేక్ష కార‌ణాలున్నాయా..? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌స్తుత పీవో అంకిత్ సార్ అయినా స‌ద‌రు అధికారిపై అంత‌ర్గ‌త విచార‌ణ‌కు ఆదేశించి అస‌లు విష‌యాలు తెలుసుకుని చ‌ర్య‌లు చేప‌డుతారో లేదో వేచి చూడాలి.

స‌మావేశాల‌కు మంగ‌ళం...

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో 13 ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. అందులో 274 గ్రామ పంచాయతీలు, 559 రెవెన్యూ గిరిజన గ్రామాలు: ఉండగా 3.15 లక్షల మంది గిరిజన జనాభా ఉంది. ఐటీడీఏ పరిధిలోని పథకాలు, పరిపాలన, నూతన పనులకు బడ్జెట్ అంశాలపై ప్రతి మూడు నెలలకు ఓసారి పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. 2017 జూన్ 8 న 59 వ పాలక మండలి సమావేశం నిర్వ హించారు. 2019 డిసెంబర్ 20వ తేదీన 60వ పాలక మండలి సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలక మండలి సమావేశం ఊసే ఎత్తడం లేదు.

2020 నుంచి కరోనా మహమ్మారి రావడంతో ఇదే కారణంతో కాలయా పన చేస్తున్నారు. సమగ్రంగా ఏ పథకంపై కూడా చర్చలు జరగకపోవడంతో గిరిజన సంక్షేమ శాఖ నుంచి పెద్ద మొత్తంలో నిధులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఐటీడీఏ పీవోగా అంకిత్ బాధ్య‌త‌లు చేప‌ట్టాకా స‌మావేశం జ‌రుగుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అడుగులు అటువైపు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. స‌మావేశం నిర్వ‌హించుకుండా ఒక‌రిద్ద‌రు అధికారులే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా కూడా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Next Story

Most Viewed