ఆందోళ‌న వ‌ద్దు.. రైతులను ఆదుకుంటాం: సీఎం కేసీఆర్

by Disha Web Desk 11 |
ఆందోళ‌న వ‌ద్దు.. రైతులను ఆదుకుంటాం: సీఎం కేసీఆర్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/పెద్దవంగ‌ర/న‌ర్సంపేట‌: అకాల వ‌ర్షంతో న‌ష్టపోయిన రైతులెవ‌రూ బాధ‌ప‌డ‌వ‌ద్దని, ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం కేసీఆర్ రైతులకు భ‌రోసా ఇచ్చారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండా, వ‌రంగ‌ల్ జిల్లాలోని దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో పర్యటించిన సీఎం కేసీఆర్ ఈ సంద‌ర్భంగా ప‌లువురు బాధిత రైతుల‌తో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.


అనంత‌రం రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. అకాల వ‌ర్షంతో రైతులు పంట‌లు న‌ష్టంపోవాల్సి రావ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని అన్నారు. వాస్తవానికి హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరేట‌ప్పుడు ఎక‌రానికి రూ.3వేలు న‌ష్ట ప‌రిహారం ఇద్దామ‌ని అనుకున్నామ‌ని, అయితే వాస్తవ ప‌రిస్థితి చూశాక రూ.10వేలు ఇద్దామ‌ని నిర్ణయించుకున్నామని తెలిపారు. ‘స్వతహాగా నేను, వ్యయసాయ‌ శాఖ మంత్రి కూడా రైతులం. వ్యవసాయంలోని క‌ష్టాలు, న‌ష్టాలు మాకు తెలుసు. రైతుల‌కు ఇబ్బందులు క‌లుగ‌వద్దని భావించే ఈ నిర్ణయం తీసుకోవ‌డం జ‌రిగింది. తెలంగాణ‌లో ఎవరూ న‌ష్టపోవద్దనదే నా ఉద్దేశం. మీరు ధైర్యంగా ఉండాలె. మీరు ధైర్యంగా ఉంటేనే నేను ధైర్యంగా ఉండగలను’ అని రైతులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు.

రైతుల‌ను నేరుగా క‌లిసి ధైర్యం చెప్పేందుకే పర్యటనకు వ‌చ్చాన‌ని అన్నారు. ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక సాయం కూడా సాధ్యమైనంత త్వరగా బాధిత రైతుల‌కు అందేలా చూస్తామ‌న్నారు. రైతులెవ‌రు అధైర్య ప‌డ‌వ‌ద్దని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. కౌలు రైతుల‌ను భూ యాజమానులు ఆదుకోవాలని కోరారు. కౌలు రైతుల‌తో క‌లెక్టర్లు ప్రత్యేకంగా స‌మావేశం అవుతారని చెప్పారు.

80 లక్షల ఎక‌రాల్లో సాగు ఉంది..

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమ‌లు చేయ‌ని ప‌థ‌కాలు ఇక్కడ అమ‌లవుతున్నాయ‌ని తెలిపారు. వ్యవసాయానికి 24 గంట‌ల క‌రెంట్ ఎంతో సత్పలితాన్నిచ్చింద‌ని అన్నారు. ఇంకా అనేక విధాలుగా ఆదుకుంటున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 75లక్షల నుంచి 80 లక్షల వ‌ర‌కు వివిధ పంట‌ల‌ను పండిస్తున్నార‌ని అన్నారు. వ‌రి సాగునే అత్యధికంగా 54 ల‌క్షల వ‌ర‌కు ఉంటుంద‌ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొర‌వ‌తో, ప‌థ‌కాల‌తో ఇప్పుడిప్పుడే రైతులు క‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డుతున్నార‌ని చెప్పారు. అయితే అకాలంగా వ‌చ్చిన వ‌ర్షంతో రైతులు నష్టపోవ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. బాధిత రైతుల‌ను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం, కలెక్టర్ నుంచి సీఎస్ వ‌ర‌కు అంద‌రూ సిద్ధంగా ఉంటార‌ని చెప్పారు.


రెడ్డికుంట తండా, అడ‌వి రంగాపురంలో పంట న‌ష్టం జ‌రిగిన ఫొటో ప్రదర్శనను ముఖ్యమంత్రి ప‌రిశీలించారు. బాధిత రైతులను పరామర్శించేందుకు రెడ్డికుంట తండాకు, అడ‌వి రంగాపురానికి కేసీఆర్‌తో మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి ర‌మేష్‌, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed