వారందరికీ టీడీపీ గాలం.. మంగళగిరి నుంచి ఫోన్లు..?

by Mahesh |
వారందరికీ టీడీపీ గాలం.. మంగళగిరి నుంచి ఫోన్లు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో పార్టీలో పనిచేసిన వారికి టీడీపీ గాలం వేస్తోంది. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం పై అధిష్టానం దృష్టి సారించింది. ఇతర పార్టీల్లో ఉన్న వారిని తిరిగి సొంత పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే కొంతమంది నేతలకు మంగళగిరి నుంచి ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చాలా మంది నేతలను తయారు చేసింది. బడుగు, బలహీన వర్గాలకు పార్టీ పెద్దపీట వేసింది. యాక్టి వ్‌గా పనిచేసినవారికి కీలక పదవులు సైతం ఇచ్చి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ పై దృష్టి సారించడం తో ఇక్కడ పార్టీ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి.

ప్రస్తుతం ఏపీలో విజయం సాధించడంతో తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఎవరెవరు ఏ పార్టీలో, ఏ హోదాలో ఉన్నారు? వారి అవసరం మనకు ఎంతమేర ఉపయోగపడు తుంది? వారిని చేర్చుకుంటే పార్టీ గ్రాఫ్ ఏ మేరకు పెరుగుతుం ది? ప్రజల్లోనూ పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉంది? అనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్‌లో కీలకంగా ఉన్న నేతలపైనా ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ నేతలతో భేటీ నిర్వహించనున్నారు. ఆ భేటీ తర్వాత ‘ఘర్ వాపసీ కి శ్రీకారం చుట్టి చేరికలను ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది.

నేతలకు మంగళగిరి నుంచి ఫోన్లు

గతంలో టీడీపీలో పనిచేసినవారు తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలలో కీలక పదవుల్లో ఉన్నారు. పార్టీ పదవులతో పాటు గత బీఆర్ఎస్ పాలనలో మంత్రులుగా పనిచేసిన వారున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా, వివిధ హోదాల్లో ఉన్నారు. అయితే ఇప్పటికీ టీడీపీకి సానుభూతి పరులు గా ఉన్నారు. ఖమ్మం కు చెందిన ఒక మంత్రి ఏపీలో టీడీపీ ఘన విజయవంతం తర్వాత ఏకంగా ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. తాజాగా కొందరు మాజీ ఎమ్మె ల్యేలు మంగళగిరికి వెళ్లి చంద్రబాబును కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో పనిచేసిన కొందరు నేతలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ చేసి మర్యాదపూర్వక భేటీకి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎవరెవరు ఆ పార్టీ వైపు చూస్తున్నారనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. మళ్లీ టీడీపీలో చేరితే ఎలా ఉంటుందని కొంతమంది నేతలు సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు కళ

ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడంతో హైదరాబాద్‌లో ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు మళ్లీ కళ వచ్చింది. నాయకులు, కార్యకర్తల హడావుడితో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. మరోవైపు తెలంగాణలోని అన్నీ ఉమ్మడి జిల్లాలో ఉన్న టీడీపీ కార్యాలయాలపై సైతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు అన్ని కమిటీలు వేయనున్నారు. పార్టీ కార్యాలయాల్లో నిత్యం కేడర్‌కు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. కార్యాలయాల భవనాల మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story