పూర్తి ఆధారాలతో సిద్ధమైన ప్రభుత్వం.. అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా?

by Disha Web Desk 2 |
పూర్తి ఆధారాలతో సిద్ధమైన ప్రభుత్వం.. అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫస్ట్ కేబినెట్ భేటీలోనే విద్యుత్ రంగాన్ని ప్రత్యేక అంశంగా టేకప్ చేసిన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లోనూ గత ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపడానికి రెడీ అవుతున్నది. విద్యుత్ రంగంలో సుమారు రూ. 81 వేల కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయని అధికారులు ఆ సమావేశంలో వెల్లడించడంతో మంత్రులు విస్తుపోయారు. ఈ రంగంలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై నిశితంగా దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీ వేదికగానే ఈ రంగంలో బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా జరగడంలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగ్‌బుక్‌లోని వివరాలను బహిర్గతం చేయడంతో బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. దీన్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది.

పూర్తి ఆధారాలతో రెడీ..

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎక్కువగా కరెంటు అంశాన్నే ప్రస్తావించింది. రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు చాలంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు తిప్పలు తప్పవని, మళ్లీ పొలాల దగ్గర పడుకోవాల్సి వస్తుందని, రాష్ట్రం అంధకారం అవుతుందని.. ఇలాంటి ప్రచారంతో కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ ఈ అంశంతోనే అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్‌ను కార్నర్ చేయాలనుకుంటున్నది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నది. నిజానికి వ్యవసాయానికి సగటున ఎన్ని గంటల కరెంటు సరఫరా అవుతున్నదో అధికారుల నుంచి ప్రస్తుత ప్రభుత్వం లెక్కలను సేకరిస్తున్నది. వ్యవసాయానికి 24 గంటలు సప్లై కావడం లేదని లెక్కలతోనే బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహాన్ని కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటున్నది. వ్యవసాయ కరెంటుపై బీఆర్ఎస్ చెప్తున్న లెక్కలన్నీ తప్పులే అని అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించాలనుకుంటున్నది.

ఆధారాలతో సహా రుజువు చేసి బీఆర్ఎస్‌ను దోషిగా చూపెట్టడమే అధికార పార్టీ వ్యూహం. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను కార్నర్ చేయడంతో బీఆర్ఎస్ చెప్తున్నదే వాస్తవమే మెసేజ్ జనంలోకి వెళ్లడంతో అందులోని తప్పులను వివరించడం ద్వారా వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయని, ఇంతకాలం రైతులను మభ్యపెట్టిందనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడమే అసలు ఉద్దేశంగా కనిపిస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేయకపోగా డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లుల చెల్లింపులు లేకపోవడం, సబ్సిడీ కరెంటుకు రీయింబర్స్ మెంట్ లేకపోవడం తదితరాలే కారణమని చెప్పాలనుకుంటున్నది.

అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కేలా ప్లాన్​

అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా గవర్నర్ ప్రసంగంతో మొదలవుతున్నందున ఆ ప్రసంగంలోనే విద్యుత్ రంగానికి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించాలనే అభిప్రాయానికి వచ్చింది. ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో వీటిని పొందుపర్చడం ద్వారా ఆ తర్వాత జరిగే ‘ధన్యవాదాలు తెలిపే తీర్మానం’పై చర్చలో భాగంగా లోతుగా ప్రస్తావించవచ్చని, బీఆర్ఎస్ తప్పుడు లెక్కలను తిప్పికొట్టవచ్చన్నది కాంగ్రెస్ వ్యూహం. అధికారులు ఇచ్చిన లెక్కలనే ఆధారంగా తీసుకుని వివరించడం ద్వారా అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కుతాయని, ఎప్పటికీ ఉండిపోతాయన్నది కాంగ్రెస్ భావన. కేవలం 24 గంటల వ్యవసాయ కరెంటు అంశమే కాక విద్యుత్ రంగంలో ఇంతకాలం గోప్యంగా ఉండిపోయియన అవకతవకలను కూడా తేటతెల్లం చేయాలన్నది మరో ప్లాన్.

Next Story

Most Viewed