దొంగల ఆటకట్టిస్తున్న డిజిటల్ వేలిముద్రలు..

by Disha Web Desk 6 |
దొంగల ఆటకట్టిస్తున్న డిజిటల్ వేలిముద్రలు..
X

నేరస్తుల గుర్తింపులో రాష్ట్ర పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దొంగలను గుర్తించి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ డేటాను ఉపయోగించి ఎన్నో కేసులను సాల్వ్ చేశారు. తాజాగా కొండగట్టు చోరీ కేసును సైతం పరిష్కరించి, ఇద్దరు దొంగలను బీదర్ లో అరెస్ట్ చేశారు. ఇలా ఏడాదిలో 420 కేసులను పరిష్కరించేందుకు ఫింగర్ ప్రింట్ డేటా బేస్ లోని వివరాలు పోలీసులకు ఉపయోగపడ్డాయి.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నో సంచలనాత్మక కేసులను పరిష్కరించేందుకు ఫింగర్ ప్రింట్ విభాగం పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నది. నేరస్తులను కటకటాల వెనక్కి పంపడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుంటూ ఆయా కేసుల్లోని నిందితులనే కాకుండా నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న వారు, కేసుల్లో అనుమానితులు, వాంటెడ్ నేరస్తులను కూడా పట్టిస్తున్నది. వేర్వేరు సంఘటనల్లో చనిపోయిన వారు ఎవరన్నది గుర్తించటంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నది.

డిజిటల్ డేటా బేస్

గతంలో పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నప్పుడు కాగితాలపై వేలిముద్రలు తీసుకునేవారు. ఆ తరువాత వాటిని ఫింగర్ ప్రింట్ వింగ్ కు పంపించేవారు. అక్కడి సిబ్బంది స్కాన్ చేసి వీటిని కంప్యూటర్లలో భద్ర పరిచేవారు. అవసరమైనపుడు అనుమానితుల వేలి ముద్రలను పోల్చి చూడటానికి చాలా సమయం పట్టేది. కానీ ప్రస్తుతం డేటా అంతా డిజిటల్ చేస్తున్నారు. హై స్పీడ్ కంప్యూటర్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, హ్యాండ్హెల్డ్ డివైస్ అందుబాటులో తీసుకువచ్చి వేలి ముద్రల విభాగాన్ని పటిష్టం చేశారు.

మొబైల్ ఫోన్లలో సైతం..

ప్రస్తుతం ఎక్కడైనా, ఎప్పుడైనా పోలీసులు ఫింగర్ ప్రింట్ డేటాలోకి వెళ్లి అప్పటికప్పుడు అనుమానితుల వేలి ముద్రలను సరి పోల్చుకునే వెసులుబాటు ఉంది. దీని కోసం క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి ఉన్నతాధికారులు హ్యాండ్ హెల్డ్ ఫింగర్ ప్రింట్స్కానర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. పూర్తి డేటాను మొబైల్ ఫోన్లకు యాక్సెస్చేశారు. ఈ క్రమంలో ఆయా కేసుల్లో అనుమానితులుగా ఉన్నవారిని ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే వీలు కలిగింది. గతేడాది ఈ విధంగా మొబైల్ సెక్యూరిటీ డివైసెస్ సహాయంతో పోలీసులు వేర్వేరు కేసుల్లో అనుమానితులుగా ఉన్న 4,684 మందిని అదుపులోకి తీసుకున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయి తప్పించుకుని తిరుగుతున్న 58 మందిని పట్టుకున్నారు. కనిపించకుండా పోయిన 130 వాంటెడ్ క్రిమినల్స్ ను కటకటాల వెనక్కి పంపించారు. ఇక, గుర్తు తెలియని మృతదేహాల సంఘటనలు జరిగినపుడు చనిపోయింది ఎవరన్నది తెలుసుకోవటంలో కూడా వేలి ముద్రల విభాగం కీలకపాత్ర పోషిస్తున్నది. తద్వారా అనాథ శవాల్లా కాకుండా చనిపోయిన వారికి వారి వారి కుటుంబభ్యుల చేతుల్లో అంత్యక్రియలు జరిగేలా కూడా ఈ విభాగం సహాయం చేస్తున్నది. గతేడాది ఇలా 42 మంది మృతదేహాలను వారి వారి కుటుంబసభ్యులకు చేర్చారు. వేర్వేరు నేరాల్లో నిందితులుగా ఉండి విదేశాలకు పారిపోవాలనుకుంటున్న వారికి కూడా ఈ విభాగం చెక్ పెడుతున్నది. ఆటోమేటెడ్ ఫింగర్ ఐడెంటిఫికేషన్ సిస్టం ద్వారా ఇలాంటివారు పాస్ పోర్టుల కోసం, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నపుడు పట్టుకోవటంలో ప్రధానపాత్ర పోషిస్తున్నది. విదేశాలకు వెళ్లాలనుకున్న, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 34 మందిని పోలీసులకు ఫింగర్ ప్రింట్ పట్టిచ్చాయి.

కేసుల పరిష్కారంలో..

కేసుల పరిష్కారంలో కూడా ఫింగర్ ప్రింట్ వింగ్ కీలకపాత్ర పోషిస్తున్నది. తాజాగా రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొండగట్టు అంజన్న ఆలయంలో జరిగిన చోరీ ఉదంతాన్ని కూడా పరిష్కరించింది. ఆలయంలో ఉన్న సెక్యూరిటీ లోపాలను అవకాశంగా చేసుకుని లోపలికి చొరబడ్డ దొంగల ముఠా స్వామివారి ఆలయం నుంచి వెండి సామాగ్రిని ఎత్తుకెల్లింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి వెళ్లిన తొమ్మిది రోజులకే జరగడం కలకలం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగిత్యాల జిల్లా పోలీసులు దొంగలను పట్టుకోవటానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అదే సమయంలో నేర స్థలం నుంచి సేకరించిన వేలి ముద్రలను ఫింగర్ ప్రింట్ విభాగానికి పంపించారు. అక్కడ ఉన్న డేటా బేస్ తో సరి పోల్చినపుడు చోరీకి పాల్పడింది పాత నేరస్తులేనని గుర్తించారు. దీంతో రెండు రోజుల్లోనే గ్యాంగ్ లోని ఇద్దరిని బీదర్ లో అరెస్టు చేయగలిగారు. ఇదొక్కటే కాకుండా గత సంవత్సరంలో మొత్తం 420 కేసుల్లో నిందితులను పట్టుకోవటంలో ఫింగర్ ప్రింట్ విభాగం కీలకపాత్ర వహించింది.


Next Story

Most Viewed