రేవంత్ రెడ్డి జోడో యాత్రలో టికెట్ల లొల్లి

by Disha Web Desk 4 |
రేవంత్ రెడ్డి జోడో యాత్రలో టికెట్ల లొల్లి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో కొత్త తరం వస్తునే ఉంటది పాత తరం పోతూనే ఉంటదనే నానుడు ఉంది. కాంగ్రెస్ పార్టీ అనగానే అందరూ కురువృద్ధుల పార్టీగా చెబుతుంటారు. కొత్త తరానికి పాత తరానికి బేధాభిప్రాయాలు సహజం అందరం కలిసి మెలిసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం అని చెప్పే కాంగ్రెస్ పార్టి రాష్ట్ర అధినేత రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాథ్ సే సే హాథ్ జోడో పాదయాత్రలో ఉండగానే విభేదాలు బహిర్గతం అయ్యాయి. గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష సందర్బంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సాక్షిగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతపై షబ్బీర్ ఆలీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి.

రేవంత్ రెడ్డి సభ ప్రారంభానికి ముందే సభాస్థలి వద్ధ సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ వర్గీయులు కయ్యానికి సిద్ధమయ్యారు. అప్పుడే రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సుభాష్ రెడ్డి స్థానంలో జాజుల సురేందర్‌కు టికెట్ కేటాయించిన విధానంపై చేసిన వ్యాఖ్యలు కామారెడ్డి కాంగ్రెస్‌లో ఉన్న గ్రూప్ రాజకీయాలకు అజ్యం పోశాయి. దానితో మంగళవారం కామారెడ్డి జిల్లాలోనే సాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్రకు మదన్ మోహన్ వర్గం దూరమయ్యింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే మదన్ మోహన్ కామారెడ్డిలో విలేకరుల సమావేశం నిర్వహించి మాజీ మంత్రి షబ్బిర్ ఆలీని ఉద్ధేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలను బహిర్గతం చేశాయి.

కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి షబ్బిర్ ఆలీ ఓక వర్గం, టీపీసీసీ ఐటి సెల్ చైర్మెన్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వకుంట్ల మదన్ మోహన్ రావులు మరో వర్గంగా గ్రూప్ రాజకీయాలను చేస్తున్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికలలో తక్కువ మెజార్టితో జహీరాబాద్ ఎంపీగా ఓడిన మదన్ మోహన్ రావు ఓడిపోయినప్పటి నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోటికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న సుబాష్ రెడ్డి సైతం తనకు టికెట్ వస్తుందని ధీమాతో అండర్ గ్రౌండ్ పని చేస్తున్నారు.

మదన్ మోహన్ రావుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దిన్ అండగా ఉండగా, సుభాష్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గీయుడిగా షబ్బీ‌ర్ ఆలీ మద్దతు ఉంది. గడిచిన ఎడాది ఎల్లారెడ్డిలో రేవంత్ రెడ్డి చెపట్టిన రైతు భరోసా బహిరంగ సభ సాక్షిగానే ఇద్దరి మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. దానితో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు టీపీసీ ఐటిసెల్ చైర్మెన్‌గా ఉన్న మదన్ మోహన్‌ను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. దానిని అయన పార్టీ క్రమ శిక్షణ కమిటి ముందుకు తీసుకువెళ్లారు.

గడిచిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ బ్యానర్లు, కరపత్రాలు ఉన్నాయని ఎల్లారెడ్డిలో మధన్ మోహన్ కాన్వాయ్‌పై సుభాష్ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. అది అలా ఉండగానే ఇద్దరు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోటీ పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో అజారుద్దీన్ ద్వారా ఎల్లారెడ్డిలో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ సమావేశంలో పార్టీ ఆదేశిస్తే తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించడం కాంగ్రెస్‌లో ఖయ్యానికి దారి తీసింది. తాజాగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థుల బాధ్యతలు చూస్తానని ప్రకటన చేయడం మధన్ మోహన్ వర్గానికి మింగుడుపడడం లేదు.

రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానని టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ కల్వకుంట్ల మధన్ మోహన్ రావు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ ఆలీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఏడుసార్లు పోటీ చేసిన షబ్బీర్ ఆలీ ఒక్కసారే గెలిచారని, పార్టీ పదవుల్లో కనీసం కొడుకును గెలిపించుకోలేడని వ్యాఖ్యానించారు.

వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే టికెట్ ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు సొత్తు కాదని, పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్ వస్తుందన్నారు. షబ్బీర్ ఆలీ రెండు నియోజకవర్గాల బాధ్యతలు చూస్తానని అనడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేల టికెట్లు ఎంపిక చేసే కార్యక్రమం ఏఐసీసీకి మాత్రమే ఉందని, పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని అన్నారు. ప్రజలు మధన్ మోహన్‌ను నాయకునిగా వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటానని వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed