ధ‌ర్మ‌సాగ‌ర్‌ను దందాకు వ‌దిలేశారా..?

by Disha Web Desk 4 |
ధ‌ర్మ‌సాగ‌ర్‌ను దందాకు వ‌దిలేశారా..?
X

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్ : హ‌న్మ‌కొండ జిల్లా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌ల రెవెన్యూ కార్యాల‌యంలో ఫాం ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ల దందా ద‌ర్జాగా జ‌రుగుతోంది. పొలం భూముల రిజిస్ట్రేష‌న్ల మాటున నాన్ లే అవుట్ల‌లోని ప్లాట్ల‌కు రిజిస్ట్రేష‌న్లు చేసేస్తున్నారు. ఒక‌టి కాదు రెండు వంద‌ల సంఖ్య‌లో పుట్టుకొస్తున్న నాన్ లే అవుట్ల‌కు నీళ్ల ప్రాయంగా జ‌రిగిపోతుండ‌టం గ‌మ‌నార్హం.

కార్యాల‌యంలోని కింది స్థాయి సిబ్బంది, కొంత‌మంది నోట‌రీల ద్వారా అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నాన్ లే అవుట్ ప్లాటుకు భారీ మొత్తంలో అక్ర‌మ వెంచ‌ర్ల నిర్వాహాకుల నుంచి ముడుపులు పుచ్చుకుంటూ రిజిస్ట్రేష‌న్ ప్రక్రియను పూర్తి చేస్తున్న‌ట్లుగా రియ‌ల్ వ‌ర్గాల నుంచి స‌మాచారం.

వ‌రంగా నాన్ లే అవుట్లు..!

వ‌రంగ‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డులోని ఎక్కువ భాగం ఈ మండ‌లంలోని ప‌లు గ్రామాల‌ను తాకుతూ వెళ్తోంది. దీంతో ఔట‌ర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని సుమారు రెండు కిలోమీట‌ర్ల వ‌ర‌కు కూడా నాన్ లే అవుట్ వెంచ‌ర్లు వంద‌ల సంఖ్య‌లో వెలిశాయి. ఇలా వెలుస్తున్న వెంచ‌ర్ల‌లో అత్య‌ధికంగా 2 ఎక‌రాల నుంచి 5 ఎక‌రాల వ‌ర‌కు, 10, 15 ఎక‌రాల వెంచ‌ర్లు కూడా ఉంటున్నాయి.

నాలా క‌న్వ‌ర్ష‌న్ లేకుండానే పొలాల్లో ప్లాటింగ్ చేసి గ‌జాల లెక్క‌న అమ్ముతున్నారు. వీటిని నిరోధించాల్సిన రెవెన్యూ అధికారులు వ్యూహాత్మ‌కంగా త‌మ జేబులు నింపుకునేందుకు అమ్యామ్యాల మార్గంగా చేసుకుంటున్నారు. ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లంలో ధ‌ర్మ‌సాగ‌ర్‌, దేవ‌నూరు, ఎల్కుర్తి, క్యాతంప‌ల్లి, పెద్ద‌పెండ్యాల‌, ఉనికిచ‌ర్ల‌, మ‌ల్ల‌క్క‌ప‌ల్లి గ్రామాల్లో వంద‌ల సంఖ్య‌లో నాన్ లే అవుట్లు వెలుస్తున్నాయి.

ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేష‌న్లు..!

అక్ర‌మ వెంచ‌ర్‌పై ప‌లుమార్లు మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నా అధికారులు డోంట్ కేర్ అన్న‌ట్లుగా అక్ర‌మార్కుల‌కు స‌హ‌క‌రింస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నాన్ లే అవుట్ వెంచ‌ర్ల‌ ప్లాట్ల‌కు రూ.10వేలు తీసుకుంటూ రిజిస్ట్రేష‌న్లు చేప‌డుతున్న‌ట్లుగా రియ‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌డిచిన కొద్ది నెల‌లుగా ధ‌ర్మ‌సాగ‌ర్ మండలంలోని ప‌లు గ్రామాల్లో నాన్ లే అవుట్ దందా జోరుగా సాగుతోంది.

ఎల్కుర్తి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1146/B4/1/1,758/2, 759/1,760, 761/B/1/1/1/1లలో వెలిసిన వెంచ‌ర్ అక్ర‌మాల‌ను తెలుసుకునేందుకు ఏ స‌ర్వే నెంబ‌ర్‌తో ఎన్ని బై నెంబ‌ర్ల‌తో రిజిస్ట్రేష‌న్లు పూర్తి చేశారో ప‌రిశీలిస్తే స‌రిపోతుంద‌ని రియ‌ల్ట‌ర్లు చెబుతున్నారు. ఔట‌ర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న ప‌లు గ్రామాల్లో జ‌రుగుతున్న నాన్ లే అవుట్ రిజిస్ట్రేష‌న్ల‌న్నీ కూడా ఫాంల్యాండ్ కింద చేసేస్తూ ప‌ట్టాపాస్ పుస్త‌కం జారీ చేస్తున్నారు.

అయితే ఏకంగా 3,4,5 ఎక‌రాల విస్తీర్ణంలో వెంచ‌ర్లు ఏర్పాటు చేసి అక్ర‌మంగా సాగిస్తున్న దందాకు అధికారులు స‌హ‌కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్డీవో వాసుచంద్ర‌తో పాటు జిల్లా ఉన్న‌తాధికారులు ధ‌ర్మ‌సాగ‌ర్ కార్యాల‌యంలో జ‌రుగుతున్న రిజిస్ట్రేష‌న్ అక్ర‌మాల‌పై దృష్టిసారిస్తే ఇంకా అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని స్థానికులు తెలిపారు.



Next Story

Most Viewed