కూలగొట్టిండ్రు.. కట్టడం మరిచిండ్రు.

by Sathputhe Rajesh |
కూలగొట్టిండ్రు.. కట్టడం మరిచిండ్రు.
X

దిశ, పెద్దపల్లి : అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది పెద్దపల్లి మున్సిపల్​ ఆఫీసు భవన నిర్మాణం పరిస్థితి. ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్​ కౌన్సిల్​లో రెండు సార్లు అధికారంలో ఉన్నా ఆఫీసు నిర్మాణానికి అతిగతీ లేక చివరకు అద్దె భవనం దిక్కైయింది. కొత్త బిల్డింగ్​ నిర్మాణం కోసం ఇప్పటికే ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేసినా నేటికీ బిల్డింగ్​ పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్​ పాలకవర్గం మొత్తం బీఆర్​ఎస్​ పార్టీ నేతలు ఉన్నప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం అధికారులకు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిని ఎత్తిచూపుతోంది.

ఉన్న బిల్డింగ్​ కూలకొట్టి ఇప్పుడు కిరాయి ఇంట్లో ఆఫీసు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం జిల్లా ఏర్పాటు కాకముందే 2011లో మేజర్​ పంచాయతీగా ఉన్న పెద్దపల్లిని అప్పటి కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం నగర పంచాయతీగా మార్చింది. నగర పంచాయతీగా ఉన్న పెద్దపల్లిని 2019లో మున్సిపాలిటీగా మార్చారు. మేజర్​ పంచాయతీ నుంచి మున్సిపల్​ స్థాయికి ఎదిగినప్పటికీ నేటికీ ఆఫీసు బిల్డింగ్​ లేకపోవడం విశేషం. 2011లో నగర పంచాయతీగా మార్చిన సమయంలో ప్రభుత్వం రూ. 2కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 50లక్షల నూతన బిల్డింగ్​ కోసం మిగిలిన రూ. 1.50కోట్లు పట్టణంలో అభివృద్ధి పనుల కోసం కేటాయించారు.

ఇద్దరు మంత్రుల శంకుస్థాపన..

కొత్త భవనం నిర్మాణం కోసం ఇప్పటి ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం చేయడానికి 2013లో అప్పటి జిల్లా మంత్రి శ్రీధర్​ బాబు కొత్త మున్సిపల్​ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ర్టం వచ్చిన తరువాత పెద్దపల్లి ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు మున్సిపాలిటీ సైతం బీఆర్​ఎస్​ కావడంతో ఆఫీసు నిర్మాణం జరుగుతుందనుకున్నారు. 2017లో మంత్రి కేటీఆర్​తో రూ. 3.50కోట్ల అంచనాతో మరోమారు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఆరేళ్లు గడిచినా నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే టీఆర్​ఎస్​ పార్టీ నుంచి గెలుపొందారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి టీఆర్​ఎస్​ ఎంపీ గెలుపొందగా, 2020 మున్సిపాల్​ ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపాలిటీని టీఆర్​ఎస్​ పార్టీ దక్కించుకున్నప్పటికీ నేటికి పనులు మొదలు కాలేదు.

అద్దె భవనంలో ఆఫీసు..

ఉన్న భవనం కూల్చివేయడంతో మున్సిపల్​ ఆఫీసును కొన్ని రోజులు మీటింగ్​హాల్​లో నిర్వహించారు. ఇరుకుగదుల్లో నిర్వహణ కష్టంగా మారడంతో ప్రస్తుతం పట్టణంలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. అద్దె భవనంపై అంతస్తులో ఉండటంలో మున్సిపల్​ ఆఫీసు పనుల మీద వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. నూతన భవన నిర్మాణంపై ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story