'చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి'

by Disha Web Desk 13 |
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ, పార్లమెంట్‌ లాంటి చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని గీతా ముఖర్జీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ మహిళ రిజర్వేషన్‌పై ఏకగ్రీవంగా నిర్ణయం చేస్తేనే మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందన్నారు. ఆనాడు చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని ఆనాటి సీపీఐ లోక్‌సభ సభ్యురాలు గీతా ముఖర్జీ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారని ఆ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఫ్యూడల్‌ భావజాలం ముసుగులో వున్న పాలకులు మహిళా హక్కుల పట్ల నేటికి వివక్ష చూపుతున్నారని విమర్శించారు. సమానపనికి సమాన పనివేతనంగా పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన వేతనాలు ఇవ్వాలన్నారు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, ర్యాగింగ్‌, ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్న వారు మరల తప్పులు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్భయ, దిశ, షీ టీమ్‌ లాంటివి ఉన్నా, దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వారి రక్షణకు సరైనటువంటి చట్టాలను రూపొందించాలన్నారు. పిల్లల పెంపకంలో ఆడ, మగ పిల్లలు అనే తేడా లేకుండా సమానంగా గౌరవించే విధంగా తమ పిల్లలకు సంస్కారం నేర్పాలని సూచించారు.



Next Story

Most Viewed