పొత్తులపై సీపీఐ కార్యదర్శి కూనంనేని సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
పొత్తులపై సీపీఐ కార్యదర్శి కూనంనేని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ప్రకటించారు. అంతేగాక, తాము ఎవరినీ బతిమాలం, తమతో అవసరముంటే వాళ్లే తమ దగ్గరకు వస్తారని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమకు బలం ఉందని, ఫలితాలను తారుమారు చేసే సత్తా వామపక్షాలకు ఉందని వ్యాఖ్యానించారు. ఎవరు అధికారంలోకి రావాలో కూడా తామే నిర్ణయిస్తామని అభిప్రాయపడ్డారు. గతంలో 2018 ఎన్నికల్లో సాలెగూడులో ఇరుక్కున్నామని అన్నారు. అతి త్వరలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభల నిర్వాహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్‌తో కలిసి పోయిన వామపక్షాలు.. అనూహ్యంగా తమ దారి తాము చూసుకోవడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది. మునుగోడు బైపోల్ ప్రచారంలో బీఆర్ఎస్‌తో తమ పొత్తు ఇప్పటికే పరిమితం కాదని, రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని లెఫ్ట్ పార్టీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఎర్రజెండా నేతలు ఒక్కటై ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించడం ఆసక్తిగా మారింది. మరి దీనిపై బీఆర్ఎస్ అధినాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Next Story

Most Viewed