రాష్ట్ర ప్రభుత్వం ఎదుట సీపీఐ కార్యదర్శి కూనంనేని కీలక డిమాండ్

by Disha Web Desk 2 |
రాష్ట్ర ప్రభుత్వం ఎదుట సీపీఐ కార్యదర్శి కూనంనేని కీలక డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2013 వేతన సవరణ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వోద్యోగుల కంటే ఎక్కువగా 43% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరిపారని గుర్తుచేశారు. ఆ తర్వాత 2017, 2021 రెండు వేతన సవరణలు నేటికీ ఆర్టీసీ కార్మికులకు అమలు కాలేదన్నారు. కాబట్టి ఈ రెండు వేతన సవరణలు ఆర్టీసీ కార్మికులకు జరిపి వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాల్సిందిగా కోరారు. టీఎస్ ఆర్టీసీలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసిలో ట్రేడ్‌ యూనియన్ల ఉనికి లేకపోవడం వలన యాజమాన్యం యూనియన్లను సంప్రదించకుండా, కోడ్‌ ఆప్‌ డీసీప్లీన్‌ పాటించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మికవర్గాన్ని భయభ్రాంతుల్ని చేస్తూ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంలో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. రాబోయే మేడే.. కార్మిక దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ కార్మికుల వేతన సవరణలను, ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

మోటార్ వెహికల్ సవరణ చట్టం రద్దు చేయాలి

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో రవాణా రంగ కార్మికులు పోషిస్తున్న కీలక పాత్రను ప్రభుత్వాలు గుర్తించాలని కూనంనేని సాంబశివరావు కోరారు. తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరగోని రాజు గౌడ్ నేతృత్వంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవితో కలిసి యూనియన్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, భరత్ ముదిరాజ్, నాయకులు అమృతం సత్యంనేత, తిరుమలేష్ గౌడ్ తదితరులు హైదరాబాద్, హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ లో శనివారం కూనంనేని సాంబశివరావు ను కలిసి రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లు చాలా సమస్యలతో సతమతమౌతున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలనీ కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు హానికరంగా మారిన మోటార్ వెహికల్ (సవరణ) చట్టం 2019 ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు రవాణా కార్మికులు తక్కువ ఆదాయం కలిగి ఉంటారని, ఎక్కువ పని గంటలు మరియు ప్రమాదాల కారణంగా తరచుగా వారి ఆరోగ్యం దెబ్బతిని జీవన నాణ్యత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కూనంనేని హామీ ఇచ్చారు.



Next Story