పేదల జోలికొస్తే తాట తీస్తాం.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరిక

by Disha Web Desk 1 |
పేదల జోలికొస్తే తాట తీస్తాం.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : బేగంపేట్, ప్రకాష్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో పేదల నివాసాలే లక్ష్యంగా ఇళ్ల కూల్చివేత జరిపిన ఎమ్యెల్యే దానం నాగేందర్ అనుచరులపై క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్ల కూల్చివేత బాధితులకు సీపీఐ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. హైదరాబాద్ బేగం‌పేట్, ప్రకాష్ నగర్‌లో భూకబ్జాదారులు పేదల ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని ఇవాళ సందర్శించి, ఇళ్ల కూల్చివేతలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ బాధలను చెప్పుకుని నారాయణ వద్ద విలపించారు. ఆరు నెలలుగా ఎమ్యెల్యే దానం నాగేందర్ అనుచరులు తమ ఇళ్ల వద్ద తిష్ట వేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు విధ్వంసం సృష్టిస్తూ.. తమ ఇళ్లను నేలమట్టం చేస్తూ అక్కడి నుంచి తమను తరుముతున్నారని ఆవేదన వ్యక్త చేశారు. అక్కడే స్థలాలు కొనుక్కొని 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నామని బాధితులు నారాయణతో మొరపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కూల్చేసిన సుమారు 50 ఇళ్ల బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందన్నారు. పేదలపై భూ కబ్జాదారులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్యెల్యే దానం నాగేందర్ అనుచరులపై ప్రభుత్వం కేసులు బుక్ చేసి జైళ్లకు పంపాలని కోరారు. కూల్చేసిన ఇళ్లు తిరిగి నిర్మించుకోవడానికి ప్రభుత్వం సాయం అందించాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని నారాయణ హామీ ఇచ్చారు. దానం నాగేందర్ అనుచరులు తిరిగి పేదల జోలికొస్తే తాట తీస్తామని నారాయణ హెచ్చరించారు.



Next Story

Most Viewed