అరెస్టు చట్టవిరుద్ధమన్న కవిత న్యాయవాది.. కాసేపట్లో కోర్టు తీర్పు

by Disha Web Desk 2 |
అరెస్టు చట్టవిరుద్ధమన్న కవిత న్యాయవాది.. కాసేపట్లో కోర్టు తీర్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు సాయంత్రం 4.30 గంటల తర్వాత తీర్పు ఇవ్వనున్నది. ఆమెను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాది జోసెబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేయగా, ఈడీ అరెస్టు చట్ట విరుద్ధమని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. ఇరు తరపున సుమారు మూడు గంటల పాటు వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్, దానిపైన జరిగిన వాదనలు, సుప్రీంకోర్టుకు ఈడీ తరఫున ఇచ్చిన హామీ, దానికి విరుద్ధంగా జరిగిన అరెస్టు.. ఇలాంటి అన్ని అంశాలపై ఇరు తరపున వాదనలు తీవ్ర స్థాయిలోనే జరిగాయి.

కేసు దర్యాప్తు తీవ్రత దృష్ట్యా అన్ని కోణాల నుంచి ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని ఈడీ ఈ వాదనల సందర్భంగా క్లారిటీ ఇచ్చింది. అరెస్టు సమయంలో మహిళా సిబ్బంది లేరని కవిత తరపు న్యాయవాది లేవనెత్తిన వాదనలు అర్థరహితమని వ్యాఖ్యానించిన హుస్సేన్... పంచనామాలోనే స్పష్టమైన వివరాలను పొందుపరిచామని, సాక్షుల నుంచి సంతకాలు కూడా తీసుకున్నామన్నారు. కవిత సామాన్య మహిళ కాదని, ప్రజా జీవితంలో ఉన్న పొలిటికల్ లీడర్ అని, అందువల్లనే విచారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్నారు. పది రోజుల పాటు ఆమెను ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్... సాయంత్రం 4.30 గంటల తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు.

ఒకవైపు ఈడీ కస్టడీకి కోరుతుండగా మరోవైపు అరెస్టే చట్టవిరుద్ధమని కవిత వాదిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యంలో కవిత అరెస్టు, జ్యుడిషియల్ రిమాండ్, ఈడీ కస్టడీ విషయంలో స్పెషల్ జడ్జి ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తారన్నది ఉత్కంఠగా మారింది.


Next Story

Most Viewed